YSRCP | మాజీ మంత్రి సీదిరికి 14 రోజుల రిమాండ్
పలాస, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజుకు పలాస న్యాయస్థానం 10 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జూలై 10న పలాస సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుబ్బ దానయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో మాజీ మంత్రి కుమారుడు ఆరవ్ వర్మ బైక్ నడిపినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే వేరొకరిని నిందితుడిగా చూపించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంలో సాక్ష్యాలను తప్పుదోవ పట్టించడం, దర్యాప్తుకు ఆటంకం కలిగించడం, నిందితుడిని రక్షించే ప్రయత్నం చేశారనే అభియోగాలపై సీదిరి అప్పలరాజును పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అనంతరం పలాస కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులో మరెవరైనా పాత్ర ఉందా, సాక్ష్యాల తారుమారుకు ఎవరెవరు సహకరించారనే అంశాలపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.
