స్థానిక ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులు కరవు
- పార్టీ పరువు కాపాడేందుకు జగన్ ప్రయత్నం
- సర్పంచ్ నుంచి కార్పొరేటర్ వరకు అభ్యర్థుల కోసం వెతుకులాట
- విజయవాడలో మేయర్ అభ్యర్థి ఎవరో చెప్పగలరా?
- కూటమి ప్రభుత్వాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు
- దౌర్జన్యాలకు తావులేదు
- టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న
విజయవాడ, ఆంధ్రప్రభ: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదని, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న విమర్శించారు. ఏదో విధంగా అభ్యర్థులను నిలబెట్టి పార్టీ పరువును కాపాడాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకేతాలు ఇస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులు దొరకక ఏకగ్రీవాలు జరిగితే తాము చేసేదేమీ లేదని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. “వైసీపీ క్లీన్‌స్వీప్ చేయకపోతే జగన్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా?” అని ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వంద శాతం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులను అడ్డుకునే పరిస్థితి ఇప్పుడు ఉండదన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందే స్పష్టం చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందని, స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. గతంలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలను దృష్టిలో ఉంచుకుని పలువురు పోటీకి ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందని బుద్ధా వెంకన్న ఆరోపించారు.
సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్ స్థానాలకు కూడా అభ్యర్థులు దొరకని పరిస్థితి వైసీపీలో నెలకొందని అన్నారు. విజయవాడలో మేయర్ అభ్యర్థి ఎవరో ప్రకటించాలని వైసీపీకి సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్‌మోహన్‌రెడ్డి కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో ప్రజలు కూటమికి అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
