మరువలేని మహానేత వైఎస్సార్..
టేకుమట్లలో వైఎస్సార్ వర్ధంతి వేడుకలు
పేదలు, రైతుల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయం
టేకుమట్ల, ఆంధ్రప్రభ: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కృష్ణారెడ్డి మాట్లాడుతూ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి సామాన్య ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నేరుగా వారి వద్దకు వెళ్లి పరిష్కారానికి కృషి చేసిన వైఎస్సార్ ప్రజా సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. ఆయన భౌతికంగా దూరమైనా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, జిల్లా నాయకులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.
