రైతుల కోసం వైఎస్ఆర్ పరితపించారు : సీఎం రేవంత్‌రెడ్డి
- ఢిల్లీలో వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవం..
- ఎంఎస్ స్వామినాథన్ పరిశోధనా సంస్థకు పురస్కారం
- వైఎస్ఆర్–కేవీపీ స్నేహం రాజకీయాలకు అతీతం
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులు, పేదల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన నాయకుడని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుల గుండెల్లో వైఎస్ఆర్ శాశ్వతంగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో డా. వైఎస్ఆర్, డా. కేవీపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
వైఎస్ఆర్, కేవీపీ రామచంద్రరావు స్నేహం రాజకీయాలకు అతీతమైనదని రేవంత్‌రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలు, ఆలోచనలను కొనసాగించాలనే ఉద్దేశంతో కేవీపీ ఫౌండేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం, ముఖ్యంగా రైతులు, పేదల అభివృద్ధికి పనిచేయడమే వైఎస్ఆర్ లక్ష్యమని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో విశేష సేవలందిస్తున్న ఎంఎస్ స్వామినాథన్ పరిశోధనా సంస్థకు 2026 సంవత్సరపు వైఎస్ఆర్ అవార్డును అందజేశారు. సంస్థ చైర్‌పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి చేసిన సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు.
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దేశంలో విద్య, సాగునీటి రంగాలకు పటిష్ట పునాది వేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. నెహ్రూ హయాంలో భాక్రా నంగల్, నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్ వంటి అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం జరిగాయని గుర్తుచేశారు. విద్య, సాగునీరు దేశ అభివృద్ధికి కీలకమైన అంశాలని కాంగ్రెస్ నాయకత్వం ఎప్పటి నుంచో గుర్తించిందన్నారు.
ఇందిరాగాంధీ హయాంలో స్వామినాథన్ కమిషన్ ద్వారా రైతులకు కనీస మద్దతు ధర వ్యవస్థ బలోపేతమైందని రేవంత్‌రెడ్డి తెలిపారు. పేదలు, రైతులు, గిరిజనుల జీవితాల్లో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీలు కీలక మార్పులు తీసుకొచ్చారని అన్నారు.
2003లో వైఎస్ఆర్ చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్రను రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారని తెలిపారు. రైతుల సమస్యలను దగ్గరగా చూసిన వైఎస్ఆర్.. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉచిత విద్యుత్ హామీని అమలు చేశారని అన్నారు. రైతుల విద్యుత్ బకాయిల్లో రూ.1300 కోట్లను రద్దు చేసి రైతుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.
వైఎస్ఆర్ హయాంలో రైతులకు అండగా నిలిచే విధానాలు, పేదలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగాయని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి పాలన అందించిన నాయకుడిగా వైఎస్ఆర్ గుర్తుండిపోతారని చెప్పారు.
ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలో పీసీసీ కార్యదర్శిగా, చీఫ్ విప్‌గా పనిచేసే అవకాశం తనకు లభించిందని గుర్తుచేశారు. వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. పేదలు, రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఆ ప్రభుత్వం పనిచేసిందన్నారు.
