రైతుని రాజు చేయాలని తాపత్రయపడిన వ్యక్తి వైఎస్సార్..
మాజీ ఎమ్మెల్యే బొల్లా
శావల్యాపురం, సెప్టెంబర్ 2 (ఆంధ్రప్రభ) : రైతుని రాజు చేయాలని తాపత్రయపడి, వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఒక్క వైఎస్.రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పిఏసి మెంబర్ బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం రోజున మండలంలోని కనమర్లపూడి గ్రామంలో మండల కన్వీనర్ బోడెపూడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా పాల్గొని వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. అనంతరం అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బొల్లా మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చేసినటువంటి బృహత్తర కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ వంటి పథకాల ద్వారా ప్రజల గుండెల్లో ఇప్పటికీ బ్రతికే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర పంచాయితీ రాజ్ విభాగం ఉపాధ్యక్షుడు జుజ్జురి ఐరామమూర్తి, శానంపూడి మాజీ సర్పంచ్ మోనపాటి శ్రీనివాసరావు, వేల్పూరు మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు తూమాటి కబ్బారావు, మండల ప్రచార విభాగం అధ్యక్షుడు పాపసాని సురేష్ తదితర మండల, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.
