వైఎస్సార్‌ ఆశయాలే వైఎస్సార్‌సీపీకి మార్గదర్శకం

పేదల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం వైఎస్సార్‌ చూపిన మార్గంలో ముందుకు సాగాలి:
మాజీ ఎమ్మెల్యే డా. జరదొడ్డి సుధాకర్‌

కోడుమూరు, ఆంధ్రప్రభ : మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలే వైఎస్సార్‌సీపీకి మార్గదర్శకాలని కోడుమూరు మాజీ ఎమ్మెల్యే డా. జరదొడ్డి సుధాకర్‌ అన్నారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా స్టాంటన్‌పురంలోని కోడుమూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి, పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ కేవలం ముఖ్యమంత్రిగా కాకుండా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేతగా అభివర్ణించారు. రైతు సంక్షేమం, ఆరోగ్యం, విద్య, మహిళల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం ఆయన అమలు చేసిన పథకాలు కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాయని గుర్తు చేశారు.

ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉచిత విద్యుత్‌, జలయజ్ఞం వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం అంటే పేదవాడికి అండగా ఉండాలనే పాలనా విధానాన్ని వైఎస్సార్‌ రాష్ట్రంలో అమలు చేశారని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సంక్షేమ పాలనకు వారసుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన నిలవడమే వైఎస్సార్‌సీపీ బలమని సుధాకర్‌ అన్నారు. కోడుమూరు నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ చూపిన సంక్షేమం, సామాజిక న్యాయం, ప్రజాసేవ మార్గంలో ముందుకు సాగడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

వైఎస్సార్‌ ఆశయాల సాధన, వైఎస్సార్‌సీపీ బలోపేతం, ప్రజా సంక్షేమం కోసం తన పోరాటం కొనసాగుతుందని సుధాకర్‌ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ న్యాయ విభాగం జోనల్‌ ఇన్‌చార్జి న్యాయవాది ప్రభాకర్‌, వెంకటేష్‌రెడ్డి, రంగన్న, దయాకర్‌, ఏసన్న, జీవన్‌, రంగస్వామి, పులకుర్తి గోపాల్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించారు.