మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళులు

పుట్టపర్తిలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు..
ఆసుపత్రి వద్ద పండ్లు, బ్రెడ్ల పంపిణీ

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా పుట్టపర్తి మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. శ్రీ దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పిలుపు మేరకు బ్రాహ్మణపల్లెలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో రోగులు, వారి సహాయకులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.ఎస్. కేశవరెడ్డి మాట్లాడుతూ పేదవాడి కన్నీటిని తుడిచి వారి ముఖాల్లో చిరునవ్వులు నింపిన మహానేత వైఎస్సార్‌ అని అన్నారు.

వైఎస్సార్‌ ఒక పేరు మాత్రమే కాదని, పేదల గుండెల్లో చెరగని నమ్మకంగా, ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిన స్ఫూర్తి అని పేర్కొన్నారు. వైఎస్సార్‌ భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన ఆశయాలు, సేవలు, జ్ఞాపకాలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాయని అన్నారు.

ఆయన సంక్షేమ పాలన, పేదల పట్ల చూపిన ప్రేమ నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తోందని కేశవరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో పుట్టపర్తి మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.