ప్రజలకు పారదర్శక పాలన అందించిన ఘనత వైఎస్సార్‌దే: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్‌రావు
కంచికచర్లలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి..
భారీ అన్నదాన కార్యక్రమం
కంచికచర్ల, ఆంధ్రప్రభ: పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఆరోగ్య రంగానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు అన్నారు. కంచికచర్ల పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
వైఎస్సార్సీపీ కంచికచర్ల పట్టణ అధ్యక్షుడు వేమా సురేష్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు హాజరయ్యారు. తొలుత పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి పేదలకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జగన్మోహన్‌రావు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ, విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు పారదర్శక పాలన అందించారని పేర్కొన్నారు.
వైఎస్సార్ పాలన అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పించిందని, సమాజంలోని అసమానతలను తగ్గించేందుకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. వైఎస్సార్ స్ఫూర్తితోనే గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని తెలిపారు.
వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగన్మోహన్‌రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బండి మల్లికార్జునరావు, వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కాలవ వాసుదేవరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కాలవ వెంకటేశ్వరరావు పెద్దబాబు, పట్టణ అధ్యక్షుడు వేమా సురేష్‌బాబు, ఎంపీటీసీ మాడుగుల మధు తదితరులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
