sharmila| మున్సిపల్ ఫలితాలపై వైఎస్ షర్మిల స్పందన
మున్సిపల్ ఫలితాలపై వైఎస్ షర్మిల స్పందన
- కూటమి విజయంపై తీవ్ర విమర్శలు..
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఆగ్రహం
- ఓటరు హక్కును అధికార బలంతో కాలరాశారు..
- ఎన్నికల సంఘం, పోలీసు వ్యవస్థపై ఆరోపణలు
అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. మున్సిపల్ ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సాధించిన విజయాన్ని ప్రజా తీర్పుగా పరిగణించలేమని విమర్శించారు. అధికార బలంతో ప్రతిపక్షాలను అణచివేసి, ప్రజల గొంతు నొక్కి సాధించిన బలవంతపు గెలుపు అంటూ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం తన అధికారిక ఎక్స్ ఖాతాలో సుదీర్ఘ ట్వీట్ చేశారు.
ఓట్లు మీరే వేసుకున్నారు.. గెలుపు మీదేనని ప్రకటించుకున్నారు!
‘ఓట్లు మీరే వేసుకున్నారు.. గెలుపు మీదేనని ప్రకటించుకున్నారు. ఇంకా ప్రజలతో, ప్రజాస్వామ్యంతో పనేంటి? ఎన్నికల్లో పారదర్శకతకు విలువేంటి? స్వేచ్ఛ, నిష్పక్షపాతానికి అర్థమేంటి?’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
అధికార బలంతో ఏకగ్రీవాలు చేశారంటూ..
కూటమి పార్టీలు రౌడీలు, గూండాలను ఉపయోగించి బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డాయని షర్మిల ఆరోపించారు. ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించి తరిమేశారని, ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో దౌర్జన్యాలకు పాల్పడి బ్యాలెట్ బాక్సులను తమ ఆధీనంలోకి తీసుకున్నారని విమర్శించారు. ఓటు వేయడానికి కూడా ప్రజలు భయపడే పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు.
ఎన్నికల సంఘం, పోలీసు వ్యవస్థపైనా విమర్శలు
ఎన్నికల సంఘాన్ని కూటమి సంఘంగా మార్చారని, పోలీసు వ్యవస్థను అధికార పార్టీలు తమ గుప్పిట్లోకి తీసుకున్నాయని షర్మిల ఆరోపించారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన అత్యున్నత హక్కు అయిన ఓటు హక్కును అధికార బలంతో కాలరాశారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలతో దేశం ముందు ఆంధ్రప్రదేశ్ పరువు తీశారని విమర్శించారు.
ప్రజాస్వామ్య మనుగడకే గొడ్డలిపెట్టు
ఓటరు తీర్పును తిరగరాసే ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య మనుగడకే గొడ్డలిపెట్టని షర్మిల పేర్కొన్నారు. వ్యవస్థల విధ్వంసానికి ఇవి పరాకాష్ఠ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్నాయని తాను ఆరోపిస్తున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు. కూటమి సాధించిన విజయాన్ని నిజమైన ప్రజా విజయంగా చూడలేమని తన ట్వీట్లో స్పష్టం చేశారు.
