వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి.. భారీ అన్నదానం
నందిగామ రూరల్, ఆంధ్రప్రభ: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని నందిగామ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఆరో వార్డులో జగన్ అన్న వాక్‌వే వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం గాంధీ సెంటర్‌లో పార్టీ నాయకుడు పారుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని నాయకులు ప్రారంభించారు. పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ పారదర్శక పాలన అందించి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా పేద, మధ్యతరగతి వర్గాలకు అండగా నిలిచారని తెలిపారు.
సమాజంలో అసమానతలను తగ్గిస్తూ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్సార్ కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ప్రభుత్వంలో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
