దివంగత సీఎం వైఎస్సార్‌కు మరణం లేదు
ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా వైఎస్సార్
వేంసూరు, ఆంధ్రప్రభ : దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా కొలువై ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు గడ్డం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని ఎర్రగుంట గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, సామాన్య ప్రజల కోసం విద్య, వైద్యం, ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని కొనియాడారు.
జలయజ్ఞం వంటి కార్యక్రమాల ద్వారా ప్రాజెక్టులు, కాలువల నిర్మాణానికి కృషి చేసి ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన మహనీయుడు వైఎస్సార్ అని పేర్కొన్నారు.
వైఎస్సార్ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేసిన గొప్ప మానవతావాది అని జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో స్థిరంగా కొలువై ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
