వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచిన మహానేత..
వైసీపీ నేతల నివాళి
పాయకాపురం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి పేద ప్రజలకు అండగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలు చిరస్మరణీయమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ 58వ డివిజన్ సింగ్‌నగర్ కృష్ణ హోటల్ సెంటర్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని నాయకులు ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్సార్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ లేని లోటు రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ తీరనిదని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, విద్యా పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని కొనియాడారు. పేదలకు వైద్యం, విద్య అందించడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.
గత ఐదేళ్ల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ‘నేనున్నాను’ అనే భరోసాతో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించామని ఆమె తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పనులు చేయకుండా గొప్పలు చెప్పుకోవడానికే పరిమితమైందని విమర్శించారు. కూటమి పాలనలో ఆసుపత్రులు సక్రమంగా పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులు, రైతులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ఆయన కుటుంబాన్ని అనవసరంగా రాజకీయాల్లోకి లాగడం శోచనీయమని శైలజారెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా పూర్తి సంసిద్ధతతో ఉన్నారని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రాజారెడ్డి, గౌస్ మొయిద్దీన్, వలి, శోభన్, అలంపురి విజయ్, ఆర్.ఎస్. నాయుడు, శ్రీరాములు, పసుపులేటి యేసు, భోగాది మురళి, రామిరెడ్డి, ఎస్.కె. మస్తాన్, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
