ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్: ఆది శ్రీనివాస్
పేదలు, రైతుల సంక్షేమానికి వైఎస్సార్ విశేష కృషి
ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు చిరస్మరణీయం
వేములవాడ, ఆంధ్రప్రభ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా బుధవారం వేములవాడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, సామాన్య ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేశారని పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, జలయజ్ఞం వంటి పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసి వ్యవసాయ రంగానికి ఊతమిచ్చారని అన్నారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసిన ప్రజానాయకుడిగా వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, నిత్యానందరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూం మధు, సీనియర్ నాయకులు నామాల ఉమా లక్ష్మీరాజం, చిలుక రమేష్, ముసుకు ముకుందరెడ్డి, నాగుల విష్ణు, పులి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
