దివంగత సీఎం వైఎస్సార్‌కు మరణం లేదు

వేంసూరు, ఆంధ్రప్రభ: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా కొలువై ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకుడు గడ్డం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఎర్రగుంట గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్సార్‌ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, సామాన్య ప్రజల కోసం విద్య, వైద్యం, ఉచిత విద్యుత్‌, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన సంక్షేమ ప్రదాత అని కొనియాడారు.

జలయజ్ఞం వంటి కార్యక్రమాల ద్వారా ప్రాజెక్టులు, కాలువల నిర్మాణానికి పెద్దపీట వేసి ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసిన గొప్ప మానవతావాది వైఎస్సార్‌ అని కొనియాడారు. ఆయన భౌతికంగా దూరమైనా ప్రజల గుండెల్లో ఎప్పటికీ స్థిరంగా నిలిచిపోతారని అన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, వైఎస్సార్‌ అభిమానులు పాల్గొన్నారు.