YS Jagan | మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు

పులివెందుల, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ వేళ పులివెందులలో రాజకీయ పరిణామాలు కీలక మలుపు తిరిగాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల రోజున రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడాన్ని ఎన్నికల నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తూ ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.

జగన్‌తో పాటు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో ఆర్వో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడం ఈ కేసుకు కారణంగా పేర్కొంటున్నారు.

పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా తమ పార్టీకి చెందిన పోలింగ్‌ ఏజెంట్లను పలు కేంద్రాల్లోకి అనుమతించడం లేదని వైసీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో జగన్‌ పోలింగ్‌ ఏజెంట్లతో కలిసి ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్‌, అవినాశ్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది