Youth Olympics | తొలి భారత మహిళగా తాన్వి రికార్డు..

చెన్నై, ఆంధ్రప్రభ :

భారత యువ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి తాన్వి పత్రి యూత్‌ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. ఈ పోటీల బ్యాడ్మింటన్‌ విభాగంలో సెమీఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా షట్లర్‌గా ఘనత సాధించింది. కీలకమైన సెమీస్‌లో విజయం సాధిస్తే.. యూత్‌ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళగా మరో చరిత్ర సృష్టించే అవకాశం ఆమెకు ఉంది. సెమీఫైనల్లో ఓడినా.. కాంస్య పతకం కోసం మరో మ్యాచ్‌ ఆడే అవకాశం లభిస్తుంది.

ఇప్పటివరకు యూత్‌ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో ముగ్గురు భారత షట్లర్లు మాత్రమే సెమీఫైనల్‌కు చేరుకున్నారు. 2010లో సింగపూర్‌లో జరిగిన తొలి యూత్‌ ఒలింపిక్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ రజత పతకం సాధించాడు. 2018లో బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన పోటీల్లో లక్ష్యసేన్‌ రన్నరప్‌గా నిలిచాడు. 2014లో ఆదిత్య జోషి బాలుర సింగిల్స్‌ సెమీఫైనల్‌కు చేరుకున్నప్పటికీ పతకం సాధించలేకపోయాడు.

తాన్వి ఇప్పుడు జపాన్‌ క్రీడాకారిణి యుజునో వతనాబేతో సెమీఫైనల్లో తలపడనుంది. వీరిద్దరూ గతంలో ఒక్కసారి మాత్రమే ఎదురుపడ్డారు. 2024లో థాయ్‌లాండ్‌లోని పాథుమ్‌ థానీలో జరిగిన జూనియర్‌ అంతర్జాతీయ సిరీస్‌లో తాన్వి 14–21, 10–21తో వతనాబే చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు అదే ప్రత్యర్థిపై గెలిచి ఫైనల్‌కు చేరుకోవాలని తాన్వి పట్టుదలతో ఉంది.