Youth Olympics | భారత్ ఖాతాలో మరో పతకం..
- డకార్ క్రీడల్లో భారత్‌కు మూడో పతకం..
- భారత వుషూ క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయం..
- యూత్ ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం
- డకార్ క్రీడల్లో భారత్‌కు మూడో మెడల్
ఆంధ్రప్రభ, క్రీడా ప్రతినిధి :
యూత్ ఒలింపిక్స్-2026లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మణిపూర్‌కు చెందిన యువ వుషూ క్రీడాకారిణి రాజకుమారి లాంచెన్‌బి చాను చరిత్ర సృష్టించారు. యూత్ ఒలింపిక్ క్రీడల్లో భారత్‌కు వుషూలో తొలి పతకాన్ని అందించి దేశం గర్వించేలా చేశారు. సెనెగల్‌లోని డకార్‌లో మంగళవారం జరిగిన మహిళల చాంగ్‌క్వాన్ కంబైన్డ్ ఫైనల్లో 18.039 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో ఈ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది.
చాను గున్షు విభాగంలో 8.723 పాయింట్లు, చాంగ్‌క్వాన్‌లో 9.316 పాయింట్లు సాధించారు. ఈ రెండు విభాగాల్లో కలిపి 18.039 పాయింట్లతో పోడియంపై నిలిచారు. అంతకుముందు ప్రాథమిక రౌండ్‌లో 17.982 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. ఈజిప్టుకు చెందిన సోండోస్ సోన్‌బోల్ 18.386 పాయింట్లతో అర్హత రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచారు.
యూత్ ఒలింపిక్స్‌లో వుషూ క్రీడ అధికారిక పతక విభాగంగా తొలిసారి చోటు దక్కించుకుంది. ఈ తొలి అవకాశంలోనే భారత క్రీడాకారిణి పతకం సాధించడం దేశ వుషూ రంగానికి విశేష విజయంగా నిలిచింది. మణిపూర్ నుంచి వచ్చిన యువ క్రీడాకారిణి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుతూ భారత క్రీడా చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలిపారు.
డకార్‌లో భారత్‌కు మూడో పతకం
యూత్ ఒలింపిక్స్-2026లో భారత్‌కు ఇది మూడో పతకం. సోమవారం మహిళల 63 కిలోల జూడో విభాగంలో ఖుష్బు రాజక్‌భాయ్ దర్జాడా రజతం సాధించారు. అదే రోజు మహిళల 100 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్‌లో ధినిధి దేశింగు కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. తాజాగా చాను వుషూలో కాంస్యం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది.
భారత వుషూకు చారిత్రక విజయం..
యూత్ ఒలింపిక్ క్రీడల్లో వుషూలో భారత్ ఇప్పటివరకు పతకం సాధించలేదు. ఈసారి ఆ క్రీడకు అధికారిక పతక విభాగంగా అవకాశం లభించగా.. చాను తొలి ప్రయత్నంలోనే కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించారు. యువ క్రీడాకారిణి సాధించిన ఈ విజయం భారత వుషూ క్రీడాకారులకు కొత్త స్ఫూర్తినివ్వనుంది.
