డీజే అనుమతులపై యువత విజ్ఞప్తి.. స్పందించిన మంత్రి గొట్టిపాటి
అద్దంకి, ఆంధ్రప్రభ: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా డీజే సిస్టమ్‌ల వినియోగానికి అనుమతులు మంజూరు చేయాలని యువత చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌తో మంత్రులు మాట్లాడి, నిబంధనలకు లోబడి డీజే సిస్టమ్‌లకు అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రుల విజ్ఞప్తిపై స్పందించిన ఎస్పీ.. అనుమతుల మంజూరుకు చర్యలు చేపట్టారు.
అయితే డీజే సిస్టమ్‌లను నిబంధనలకు అనుగుణంగా, పరిమిత శబ్దంతోనే వినియోగించాలని మంత్రి సూచించారు. ప్రజలు, వృద్ధులు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. శబ్ద కాలుష్యానికి తావులేకుండా వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
