ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువత
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : ఆన్లైన్ బెట్టింగ్ ముఠా(Online betting gang) ఉచ్చులో పడి మధ్యతరగతి కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. అత్యాశతో దందా ఊబిలోకి దిగుతున్న యువకులు చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాలు బెదిరింపులతో ఒక కుటుంబం భయానక అనుభవిస్తోంది. చివరకు పోలీసులు తమను రక్షించాలని వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది.
సిరిసిల్ల అర్బన్ పరిధి లోని పెద్దూరు గ్రామంలో ఓ యువకుడు ప్రణాయ్ బెట్టింగ్ వలలో చిక్కుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ఈ యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా మొదలైన గేమ్ చివరికి తన కుటుంబాన్ని రోడ్డున పడే స్థితికి చేర్చింది. బెట్టింగ్ ముఠా మొదట చక్కగా లాభాలతో ప్రలోబపెట్టి ఆకర్షించింది. భారీ లాభాలు వస్తాయని నమ్మించి.. ఆ తర్వాత నష్టాలు చూపించి డబ్బులు తీసుకురావాలని బెదిరింపులు మొదలయ్యాయి. డబ్బులు ఇవ్వకపోతే ప్రణయ్(Pranay) ప్రాణాలు పోతాయని ముఠా బెదిరించడంతో భయభ్రాంతులకు గురైన ప్రణయ్ ఆత్మహత్యా యత్నానికి కూడా పూనుకున్నాడు.
కొడుకుపై ప్రేమతో తల్లి తన బంగారం అమ్మి(selling gold), తెలిసీన వారి వద్ద అప్పులు చేసి మరీ 40 లక్షల వరకు ఇచ్చింది. కానీ డబ్బులు ఇచ్చినా… ముఠా దౌర్జన్యం తగ్గలేదు. ప్రణయ్‌ను పలుమార్లు బంధించి, పదిమంది కాన్ఫరెన్స్ కాల్(conference call)తో వేధింపులకు గురి చేసి ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. పలుమార్లు ఆత్మహత్యా యత్నం చేసిన ప్రణయ్ ఇప్పుడు మానసికంగా కృంగి పోయాడు. బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్ళిన ఆయన తండ్రి కూడా కొడుకు దక్కడేమోనన్న భయంతో ఇంటికి తిరిగి వచ్చాడు.
ముఠా బెదిరింపులు తగ్గక పోవడంతో కుటుంబం కూడా మూకుమ్మడి ఆత్మహత్య నిర్ణయం తీసుకునే స్థాయికి చేరింది. కానీ ఇలా చనిపోతే తామే తప్పుచేసిన వారము అవుతామని ఈ విషయం అందరికి తెలవాలని పెద్ద మనుషుల(big men)కు విషయం తెలపగా పంచాయితీకి వారిని పిలవగా వారు రాలేదు.
ఈ ముఠా సభ్యులు కూడా అదే ప్రాంతానికి చెందిన వారే అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులకు మాత్రం పోలీసులు కాపాడతారన్న నమ్మకమే వారిని నిలబెడుతోంది. కానీ బెట్టింగ్ ముఠా హెచ్చరిక ఫిర్యాదు చేస్తే నీ కొడుకు దొరకడనే మాటలకు బాధిత కుటుంబం కుదేలవుతోంది.
- సిరిసిల్ల అర్బన్‌లోనే కాదు…
జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాలు ఎన్ని యాక్టివ్‌గా ఉన్నాయో.. ఎన్ని కుటుంబాలు వీరి అరాచకాలకు బలవుతున్నాయో.. అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి మొబైల్ ఫోన్(mobile phone)లో దాగి ఉన్న ఈ డిజిటల్ ముఠాలు ఇప్పుడు ప్రాణాలు పణంగా పెడుతున్నాయి.
ప్రణయ్ కుటుంబం ఒక్కటే కాదు… ఇంకెంతమంది ఇలా మౌనంగా బలైపోతున్నారో అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. బెట్టింగ్ ముఠా ఆగడాలపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

