ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి.. బైక్‌ రైడర్‌కు గాయాలు

బంజారాహిల్స్‌ కార్‌ షోరూమ్‌ ఉద్యోగిని మృతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా.. బైక్‌ రైడర్‌ గాయపడ్డాడు. టీజీఎస్‌ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వజ్జపర్తి హేమ దుర్గ (26)గా గుర్తించారు. ఆమె బంజారాహిల్స్‌లోని ఓ కార్‌ షోరూమ్‌లో కస్టమర్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పంజాగుట్ట పోలీసుల వివరాల ప్రకారం.. హేమ దుర్గ పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బైక్‌ ట్యాక్సీని బుక్‌ చేసుకున్నారు. శ్రీనగర్‌ కాలనీ మార్గంలో వాల్యూ జోన్‌ స్టోర్స్‌ వెనుక వైపు రోడ్డులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా ఉండగా.. బైక్‌ ఎడమవైపు మలుపు తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హేమ దుర్గ మృతి చెందగా.. బైక్‌ రైడర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.