యువకుడి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే?

  • డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు వాహనం స్వాధీనం
  • వాహనం ఇవ్వకపోవడంతో మనస్తాపం?
  • అందరూ చూస్తుండగానే.. ఆత్మహత్యాయత్నం
  • కాపాడే క్రమంలో ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌కు గాయాలు

బంటుమిల్లి, ఆంధ్రప్రభ: పోలీస్‌ స్టేషన్‌ ముందే ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బంటుమిల్లిలో కలకలం రేపింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు.. స్టేషన్‌ నుంచి బయటకు వచ్చిన వెంటనే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని కాపాడటంతో ప్రాణాపాయం తప్పింది. ఈ క్రమంలో యువకుడిని రక్షించే ప్రయత్నం చేసిన ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృత్తివెన్ను మండలం దోమనగొంది గ్రామానికి చెందిన తిరుమలశెట్టి కనకరాజు (25) ఈ నెల 16న బొలెరో వాహనంలో బంటుమిల్లి వైపు వెళ్తుండగా ట్రాఫిక్‌ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్సై ఎం. నాగరాజు వాహనాన్ని ఆపారు. కనకరాజు డ్రైవర్‌ యూనిఫాంలో లేకపోవడంతో పాటు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలో పోలీసులతో కనకరాజు దురుసుగా ప్రవర్తించినట్లు కూడా పోలీసులు పేర్కొన్నారు.

వాహనం కోసం వచ్చి.. పెట్రోల్‌తో స్టేషన్‌ బయటకు

మంగళవారం కనకరాజు తన బొలెరో వాహనం తీసుకెళ్లేందుకు బంటుమిల్లి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. అయితే కేసు నమోదు కావడంతో నిబంధనల ప్రకారం కోర్టు ద్వారా వాహనాన్ని తీసుకోవాల్సి ఉంటుందని పోలీసులు అతడికి తెలిపారు. దీంతో స్టేషన్‌ నుంచి బయటకు వచ్చిన కనకరాజు.. ముందుగానే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

అతడు ఒక్కసారిగా నిప్పంటించుకునే ప్రయత్నం చేయడంతో అక్కడున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్సై నాగరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ నాగమల్లేశ్వరరావు వెంటనే అతడిని కాపాడేందుకు ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం 108 వాహనానికి సమాచారం అందించి కనకరాజును మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు.

రక్షించే క్రమంలో పోలీసులకు గాయాలు

కనకరాజును కాపాడే ప్రయత్నంలో ఎస్సై నాగరాజు చేతి వేళ్లకు కాలిన గాయాలయ్యాయి. హెడ్‌ కానిస్టేబుల్‌ నాగమల్లేశ్వరరావు మోకాలికి గాయాలయ్యాయి. ఘటన సమయంలో అక్కడే ఉన్న మరికొందరు ఫిర్యాదుదారులకు కూడా స్వల్ప గాయాలైనట్లు సమాచారం. గాయపడిన ఎస్సై నాగరాజును కూడా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కనకరాజును మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

గతంలోనూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు?

కనకరాజుపై గతంలోనూ బంటుమిల్లి పోలీస్‌ స్టేషన్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే తాజా ఘటనకు అసలు కారణం ఏమిటన్నది పూర్తిగా తెలియాల్సి ఉంది. వాహనం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడ్డాడా? లేక మద్యం మత్తులో ఉన్నాడా? అనే విషయాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.