ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర
ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర
ఆరోగ్యాంధ్ర దిశగా ముందడుగు వేయాలి: కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
ఆంధ్రప్రభ, విజయవాడ: యోగాంధ్ర–2026లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలను ప్రజా ఉద్యమంలా నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
విజయవాడ అర్బన్ పరిధిలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో మంగళవారం ఉదయం యోగా అభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ వివిధ శాఖల అధికారులు, ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి దిశానిర్దేశం, స్ఫూర్తితో జిల్లాలో ఊరూవాడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బీఆర్‌టీఎస్ రోడ్డు, బెరం పార్కు తదితర ప్రాంతాలతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ప్రతి చోటా యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రజలందరినీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర నిర్మాణం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆయుష్, వైద్య ఆరోగ్య, పురపాలక, రెవెన్యూ, పంచాయతీరాజ్, యువజన సంక్షేమం, విద్యాశాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
సమాజంలోని ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో రోజుకో థీమ్‌తో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే పోలీస్ థీమ్ యోగా కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాలో దాదాపు 10 వేల మంది యోగా ట్రైనర్లు అందుబాటులో ఉన్నారని, వారి శిక్షణ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రోజూ 45 నిమిషాలు యోగా అభ్యాసం చేస్తే జీవనశైలి వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని, 60 నుంచి 70 శాతం వరకు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని కలెక్టర్ వివరించారు. ప్రతి కుటుంబంలో అందరూ యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటు ఏకాగ్రత, శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి. చంద్రశేఖర్, జిల్లా ఆయుష్ అధికారి డా. వై. రత్నప్రియదర్శిని, యువజన సంక్షేమ అధికారి డా. కొల్లేటి రమేష్, డీఎంహెచ్‌వో డా. జె. ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.
