వైఎన్ కళాశాల విద్యార్థుల శాంతి ర్యాలీ
నరసాపురం, ఆంధ్రప్రభ: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నరసాపురంలోని శ్రీ వైఎన్ కళాశాల గాంధీ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. గాంధీజీ 157వ జయంతి వేడుకలను కళాశాలలో ఘనంగా నిర్వహించారు.
కళాశాల వైస్ ప్రెసిడెంట్ పోలిశెట్టి రఘురామారావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ అందే రాం సతీష్ కళాశాలలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక శివాలయం సెంటర్ వద్ద మానవహారం చేపట్టి, అక్కడి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
సబ్‌జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం
నరసాపురం సబ్‌జైలులో జైలు సూపరింటెండెంట్ టి. అప్పారావు ఆధ్వర్యంలో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రెసిడెంట్ పోలిశెట్టి రఘురామారావు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీతో పాటు ఎంతోమంది చేసిన త్యాగాల ఫలితంగానే దేశ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నారని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ ఆశయాలను మరువకుండా ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని సూచించారు. మంచి ప్రవర్తనతో జీవితాన్ని మార్చుకుని సమాజంలో గౌరవం పొందాలని ఖైదీలకు సూచించారు.
సబ్‌జైలు పర్యవేక్షణ అధికారి టి. అప్పారావు మాట్లాడుతూ వైఎన్ కళాశాలతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. కళాశాల అధ్యాపకులు జైలుకు వచ్చి ఖైదీలకు అందిస్తున్న స్ఫూర్తిదాయకమైన సందేశాలు వారిలో మార్పునకు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగి సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని కోరారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.పి.వి. అప్పారావు మాట్లాడుతూ గాంధేయ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. గాంధీజీ సిద్ధాంతాలు నేటికీ ఆచరణీయమైనవేనని, వాటిని జీవితంలో పాటిస్తూ ముందుకు సాగాలని కోరారు.అనంతరం గాంధీ అధ్యయన కేంద్రం, నరసాపురం లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ డాక్టర్ చినిమిల్లి శ్రీనివాస్, డాక్టర్ షేక్ సులేమాన్, గాంధీ అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ పులపర్తి వెంకట సుబ్బారావు, అధ్యాపకులు ఇంటి ప్రభాకర్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆర్.వి. సుబ్బారావు, ఇతర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
