తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా వరంగల్, జనగామ, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది.
