ఎస్‌ఎంసీ ఎన్నికలపై వైసీపీ భగ్గు

టీడీపీ నేతల తీరుపై తీవ్ర ఆరోపణలు
ఓటర్లను ప్రలోభపెట్టారంటూ ధ్వజం
విద్యాసంస్థల్లో రాజకీయాలు వద్దంటూ మండిపాటు
బుచ్చయ్యపేట, ఆంధ్రప్రభ: వడ్డాదిలో ఎస్‌ఎంసీ ఎన్నికలు రాజకీయ వివాదానికి కేంద్రంగా మారాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు రూ.500, రూ.1,000 చొప్పున నగదు పంపిణీ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు.

ఓటర్లపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారని విమర్శించారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం జరగాల్సిన ఎస్‌ఎంసీ ఎన్నికలను రాజకీయ ఆధిపత్యానికి వేదికగా మార్చారని మండిపడ్డారు. శనివారం వడ్డాదిలో మాజీ జెడ్పీటీసీ దొండా రాంబాబు, మండల వైసీపీ అధ్యక్షుడు జోగా కొండబాబు, టౌన్‌ వైసీపీ అధ్యక్షుడు దొండా నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వద్ద మెప్పు పొందేందుకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ఎస్‌ఎంసీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారని ఆరోపించారు. స్థానిక కూటమి నేతలతో కలిసి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా సాగిందని వైసీపీ నేతలు ఆరోపించారు. కోరం సరిపోకపోయినా ఓటర్లు కానివారిని అనుమతించారని విమర్శించారు. ఈ కారణాలతో వడ్డాది కేజీబీవీ, జడ్పీ హైస్కూల్‌ ఎస్‌ఎంసీ ఎన్నికలను బహిష్కరించినట్లు తెలిపారు. విద్యాసంస్థల్లో రాజకీయ జోక్యం తగదని, ఎస్‌ఎంసీ ఎన్నికలను పార్టీలకు అతీతంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. విద్యాలయాల్లో రాజకీయాలకు తావివ్వడం సరికాదని, విద్యార్థుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా వడ్డాదిలో ప్రధాన సమస్యలను పరిష్కరించలేదన్నారు. సమావేశంలో టౌన్‌ యూత్‌ వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీనివాస్‌, మాజీ ఎంపీటీసీ రమణ, మాజీ సర్పంచ్‌ పెదిరెడ్ల మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.