వెలుగోడు జలాశయం ముట్టడి పేరుతో వైసీపీ డ్రామాలు

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆగ్రహం

నంద్యాల రూరల్, ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడు జలాశయం ముట్టడి పేరుతో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, వైసీపీ జిల్లా నాయకులు నిర్వహించిన సమర శంఖారావం కార్యక్రమంపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం నంద్యాల జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో మంత్రులు ఎన్.ఎం.డి ఫరూఖ్, బిసి జనార్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధి లేకుండా కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నేతలు ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. ఎలినోవ ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల కారణంగానే సాగునీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. ఆరు నెలల ముందుగానే రైతులకు నీరు అందించే పరిస్థితి లేదని ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించినప్పటికీ, ఇప్పుడు రైతులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయ డ్రామాలకు తెరలేపడం దురదృష్టకరమన్నారు.

తండ్రి, కొడుకులు చక్రపాణి రెడ్డి, శిల్పా రవికిషోర్ రెడ్డిలు కలిసి మంచి డ్రామాలు ఆడుతున్నారు. రైతుల మేలు కోసం కాదు, కేవలం రాజకీయ ఉనికి కోసం ఈ డ్రామాలు అని ఎమ్మెల్యే బుడ్డా మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.

వైసీపీ అధికారంలో ఉండగా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీగా రైతుల ప్రయోజనాల కోసం చేసిన పోరాటాల తేదీలు, సందర్భాలు మరిచారా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రైతులకు ఎన్ని సార్లు సాగునీరు అందించారో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. సాగునీరు ఇస్తానని మాట ఇచ్చి సాగునీరు ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచిన శిల్పా చక్రపాణి రెడ్డి శంఖారావాలతో డ్రామాలు చేస్తే సహించేదిలేదన్నారు.

సాగునీటి సమస్యల పరిష్కారం కోసం గతంలో కర్నూలుకు వెళ్లి అప్పటి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తే పోలీసులతో అడ్డుకున్న ఘటనలను ప్రజలు మర్చిపోలేదని గుర్తుచేశారు. అప్పట్లో రైతుల సమస్యలను పట్టించుకోని వారు ఇప్పుడు రైతు ప్రేమికులుగా నటించడం హాస్యాస్పదమన్నారు.

ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని, రైతులకు ఏ విధంగా సాగునీరు అందించాలనే అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రైతుల ప్రయోజనాలే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వం అన్ని కోణాల్లో చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.

వైసీపీ నేతల రాజకీయ ఆరోపణలు, ప్రచారాలను రైతులు నమ్మవద్దని కోరిన ఎమ్మెల్యే బుడ్డా. రాజశేఖరరెడ్డి రైతుల సంక్షేమం కోసం ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రతి నిర్ణయం రైతు ప్రయోజనాల దృష్ట్యానే తీసుకుంటున్నామని వెల్లడించారు.