X Road | ఆదరించండి.. ఈదులకుంట తండాను అభివృద్ధి చేస్తా…
ఈదులకుంట తండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రజిని బానోత్
X Road | తొర్రూరు, ఆంధ్రప్రభ : ఈనెల 14న జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తనను సర్పంచ్ గా గెలిపించి ఆదరిస్తే ఈదులకుంట తండాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఈదులకుంట తండా గ్రామ సర్పంచ్ అభ్యర్థి రజిని బానోతు(Rajini Bhanothu) అన్నారు. ఈ రోజు గ్రామంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింట ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ.. గతంలో ఉమ్మడి గ్రామంలో ఈదులకుంట తండాను గత పాలకులు పట్టించుకోలేదని, కేవలం తండావాసులను ఓటు కోసమే వాడుకున్నారని, ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy), టీపీసీసీ ఝాన్సీ రెడ్డిల కృషితోనే నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిందని,ఈ ఎన్నికల్లో తనను సర్పంచ్ గా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీ రెడ్డిల సహకారంతో గ్రామస్తులు ఎదుర్కొంటున్న అసైన్ ల్యాండ్, దేవదాయ భూముల సమస్యను పరిష్కరిస్తామన్నారు.
గ్రామ పరిధిలోని వాగుపై రెండు కల్వర్టుల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టాయిలెట్లు, ప్రహరీ గోడ, దుర్గమ్మ ఆలయానికి ప్రహరి గోడ నిర్మిస్తామన్నారు. ఎక్స్ రోడ్డు(X Road) నుండి ఈదులకుంట తండా వరకు వీధిలైట్లు ఏర్పాటు చేస్తానని అన్నారు. గ్రామంలో అన్ని వీధులలో వీధిలైట్లు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, మురికి కాలువలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బానోత్ రామచంద్రు నాయక్, మాలోతు రవీందర్, బానోతు వెంకన్న, బానోతు తేజ నాయక్, జగన్, మాలోత్ శ్రీను నాయక్, సురేష్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, మహిళలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

