world cup| నేడు భార‌త్‌, న‌మీబియా ఢీ

world cup| నేడు భార‌త్‌, న‌మీబియా ఢీ

  • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్‌
  • రాత్రి 7 గంటలకు ఆరంభం
  • టీమిండియాను వెంటాడుతున్న‌ గాయాలు

world cup| ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నేడు (ఫిబ్రవరి 12) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ తన రెండో మ్యాచ్‌లో నమీబియాతో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై గెలిచిన జోరులో ఉన్న టీమిండియా, ఇప్పుడు నమీబియాను కూడా చిత్తు చేయాలని చూస్తోంది. ఢిల్లీలో ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. టీమిండియాతో పోల్చుకుంటే చిన్న జట్టే కావడంతో నమీబియాపైనా గెలుపు నల్లేరు మీద నడకే కావొచ్చు.

సొంతగడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమ్‌ఇండియా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి పోరులో యూఎస్‌ఏపై విజయం సాధించిన సూర్యకుమార్‌ సారథ్యంలోని భారత్ గురువారం నమీబియాతో తలపడనుంది. గ్రూప్‌ ‘ఏ’లో భాగంగా తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆడనున్న భారత్ దానికి ముందు నమీబియాతో మ్యాచ్‌ను ప్రాక్టీస్‌గా వాడుకోవాలని భావిస్తోంది. ఇరుజట్లలో చాలా అంతరం ఉంది. మొదటి మ్యాచ్‌లో యూఎస్‌పై స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. టీమ్‌ఇండియా ఇవాళ నమీబియాపై కలిసికట్టుగా కదంతొక్కాల్సిన అవసరం ఉంది. టీమ్‌ఇండియాను గాయాల బెడద వెంటాడుతోంది.

గాయాల బెడ‌ద‌
కాగా- ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు సవాళ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొంతమంది కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఆందోళనలు ఉండగా, ఇప్పుడు కొత్త గాయం జట్టు యాజమాన్యాన్ని మరింత కలవరపెడుతోంది. మ్యాచ్‌కు ఒక రోజు ముందు ఢిల్లీలో జరిగిన నెట్ సెషన్‌లో ఇషాన్ కిషన్‌ గాయపడ్డాడు. అతని ఎడమ కాలి బొటనవేలికి గాయమైంది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఓ సూపర్ ఫాస్ట్ యార్కర్ డెలివరీ అతని కాలిని బలంగా తగిలింది. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నిన్ననే ఆయన డిశ్చార్జ్ అయినప్పటికీ, ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌తో తన వరల్డ్ కప్ అరంగేట్రం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. వైరల్ ఫీవర్ కారణంగా అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. బుమ్రా రాకతో భారత బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. అయితే గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి రాణించిన మహమ్మద్ సిరాజ్ ఇప్పుడు బెంచ్‌కే పరిమితం కావలసి ఉంటుంది. అర్ష్‌దీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ కావడం అతనికి కలిసొచ్చే అంశం, అందుకే అతన్ని జట్టులో కొనసాగించే అవకాశం ఉంది. స్థానిక ఆటగాడు కుల్దీప్ యాదవ్‌కు ఢిల్లీ పిచ్‌పై మంచి పట్టు ఉన్నప్పటికీ, మేనేజ్మెంట్ మాత్రం వరుణ్ చక్రవర్తి వైపే మొగ్గు చూపుతోంది. అమెరికాపై వరుణ్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా ఒక వికెట్ కూడా తీశాడు. పాకిస్థాన్ లాంటి పెద్ద మ్యాచ్‌కు ముందు విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడం ఇష్టం లేని టీమిండియా, వరుణ్‌ను మాత్రమే స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కొనసాగించే అవకాశం ఉంది.

భారత్ అంచనా జట్టు:
సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

నమీబియా జట్టు:

ఎరాస్మస్‌ (కెప్టెన్ ), స్టీన్‌ కాంప్, ఫ్రైలింక్, జాన్‌ నికోల్, జేజే స్మిత్, జెన్‌ గ్రీన్, లైచెర్, విలియమ్‌ మైబుర్గ్, రూబెన్, బెర్నార్డ్‌ స్కాట్జ్, బెన్‌ షికొంగో ఉన్నారు.

Leave a Reply