మన ఇలాకాలో మనపైనే కుట్రలా..?

  • మనలోని ప్రత్యర్థులను కనిపెట్టండి
  • జరిగిన ఈ ఘటనపై దృష్టి పెట్టండి
  • ఇంటి దొంగలపై కఠిన చర్యలు తప్పవు
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వర్కింగ్‌ ప్రెసెడెంట్‌ కేటీఆర్‌
  • ఉభయ సభల్లో సభ్యుల సస్పెన్షన్‌ పర్యవసానంపై సమాలోచన
  • కాంగ్రెస్‌ కుట్రలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో : మనలోనే ప్రత్యర్థులా? అదేలా జరిగింది? పార్టీ వ్యూహాన్ని దెబ్బకొట్టేలా చేసిందెవరు? అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు పార్టీ అంతర్గత వ్యవహాలపై తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఎర్రవల్లి ఫాంహౌస్‌ వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తల హంగామా అనంతరం…. ఆ ప్రాంతంలో పసుపు నీళ్లు చల్లడంపై ఆయన ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే, అధికార కాంగ్రెస్‌ ఉద్దేశపూర్వకంగా వ్యవహరించి అసెంబ్లి నుంచి సస్పెన్షన్‌కు గురయ్యేలా చేసిందని స్పష్టం చేశారు. ఈ రెండు అంశాలపై గురువారం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉభయ సభల్లో సభ్యుల సస్పెన్షన్‌ పర్యవసానంపై సమాలోచనలు జరిపారు.

శాసన సభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ రాజకీయ వ్యూహం దెబ్బతిన్నదన్న ఊహాగానాల నేపథ్యంలో లోతుగా సమాలోచనలు జరిపారు. ఉభయ సభల్లో జరిగిన ఈ వ్యవహారాన్ని, ప్రాంగణంలో జరిగిన ఘటన వెనకున్న కుట్రలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని దిశానిర్ధేశం చేశారు.

దళిత సామాజికవర్గాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీకి దూరం చేయాలన్న కుట్ర జరుగుతోందని, ఈ వ్యవహారంమంతా చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. కొందరు పనిగట్టుకుని ఈ దురాగతానాకి పాల్పడినట్లు తెలుస్తోందని, కాంగ్రెస్‌ కుట్రలకు సొంత పార్టీ నేతలే సహకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాని అన్నారు.

పార్టీని అప్రతిష్టకు గురిచేసిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని, అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపి తనకు నివేదించాలని ఆదేశాలిచ్చారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయలు, 22(ఏ) నిషేదిత భూములు తదితర అంశాలపై అసెంబ్లీ వేదికగా గట్టిగా నిలదీయాలనుకుంటే, ఆ వ్యూహాన్ని దెబ్బతీసేలా కొందరు కుట్రచేశారని కేటీఆర్‌ మండిపడ్డారు.

అదును చూసి పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ నిరంతరం మనపైనే గురి పెట్టినట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోందని, ఇలాంటి సమయంలో ప్రతివ్యూహం అమలు చేయడంతో మరింత అప్రమత్తమై ఉండాల్సిన అవసరముందని బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌లో భాగంగా ఉభయ సభలోని శాసన సభాపక్ష నేతలు, ఉప నేతలు, సభ్యులందరికీ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో దిశానిర్ధేశం చేశారు.

”మనలోని ప్రత్యర్థులను కనిపెట్టండి.. జరిగిన ఈ ఘటనపై దృష్టి పెట్టండి.. ఇంటి దొంగలపై కఠిన చర్యలు తప్పవు” అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సంయుక్త కార్యాచరణతో, పటిష్టమైన రాజకీయ వ్యూహంతో ఉండాలని సూచించారు. భవిష్యత్తులో మనపై మరిన్ని ప్రయోగాలు జరగవచ్చునని పేర్కొంటూ.. కాంగ్రెస్‌ కుట్రలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఎర్రవల్లి ఫాంహౌస్‌ వద్ద జరిగిన పసుపు నీళ్ల ఘటన వెనకున్న వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరలో పసిగట్టాలని అన్నారు. ఎవరు ఇలా చేస్తున్నారు..? ఎందుకు చేస్తున్నారు..? ప్రత్యర్థులకు సహకరిస్తున్న వారెవరు? అనే కోణంలో గట్టిగా దృష్టి పెట్టండి అంటూ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు పదేపదే సూచనలు చేశారు.

పార్టీ ఆదేశం లేకుండా, ఇలాంటి పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో చిన్నా, చితక నాయకులు అనాలోచితంగా చేసే పనులపై నిర్లక్షం వహిస్తే.. పార్టీకి నష్టం జరుగుతుందన్నారు.

ఒక్కోసారి పార్టీ పట్ల కార్యకర్తల్లో అభిమానం ఎక్కువై అనుకున్న వ్యూహం బెడిసికొట్టే ప్రమాదం కూడా ఉంటుందని, అందుకు తాజా ఘటననే ప్రత్యక్ష ఉదారహణ అని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజక వర్గ ఇంచార్జీలు ఇలాంటి వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి బలంగా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గపపడుతున్న కొద్దీ పార్టీ కార్యాచరణ మరింత వేగవంతంగా అమలు కావాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు.

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాదు.. ఎన్నికల ప్రచార సభల్లో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు ఇష్టారాజ్యంగా వాగ్ధానాలు కురిపించారని కేటీఆర్ గుర్తుచేశారు. వాటిని నెమరువేసుకుని… సమయం, సందర్భం చూసుకుంటూ ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సూచించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ గేటువద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాష్టీకాన్ని గ్రామాల్లోకి తీసుకువెళ్లాలని, వ్యూహాలత్మక ప్రచారంతో కాంగ్రెస్‌పై రాజకీయంగా పైచేయి సాధించాలని స్పష్టం చేశారు.

ఇదే అంశపై జాతీయస్థాయిలో ఉద్యమ స్పూర్తిని ప్రదర్శించాలని, నేషనల్‌ విమెన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని దిశానిర్ధేశం చేశారు. ఇందుకు సంబంధించి పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో పాటు సీనియర్‌ నేతలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డి తదితరులు కూడా ఢిల్లీ వెెళ్లాలని కేటీఆర్‌ సూచించారు.

అలాగే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి జరిగిన అవమానం, అధికార పార్టీ కుట్రలపై శుక్రవారం తెలంగాణ భవన్‌లో మాక్‌ అసెంబ్లీ నిర్వహించే అంశపై చర్చించి మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, మీడియా సాధనాలు, సోషల్‌ మీడియా వ్యవస్థ ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా చూడాలని పేర్కొన్నారు.

రేవంత్‌ సోదరుల భూ దందాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న ఉద్యమ స్పూర్తిని క్షేత్రస్థాయి వరకూ చాటి చెప్పాలన్నారు. 22(ఏ) నిషేదిత భూముల వ్యవహారంతో అనేక మంది సామాన్య మధ్యతరగతికి చెందిన వాళ్లు ఆందోళనకు గురవుతున్నారని, వారికి మద్దతిస్తూ ఉద్యమించేందుకు సిద్దంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమస్యపై బలమైన పోరాటాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుండి నడిపించాలని బాద్యతలు అప్పగించారు.