వర్షాకాలంలోనూ దాహం కేకలు
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల రాస్తారోకో
నల్లమాడ, ఆంధ్రప్రభ : వర్షాకాలంలోనూ తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి శ్రీ సత్యసాయి జిల్లాలోని నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో నెలకొంది. వారం రోజులుగా తాగునీటి సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తూ గ్రామ మహిళలు మంగళవారం నల్లమాడ–మలకవేమల ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. తాగునీటి సమస్యను పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండగా, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పెరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.
వారం రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తమ వద్దకు వచ్చే నాయకులు.. ఇప్పుడు కనీసం గుక్కెడు మంచినీరు అందించే విషయంలో కూడా స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి రెడ్డిపల్లి గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మహిళలు డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ధర్నా కారణంగా కొంతసేపు ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి తక్షణమే తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరారు.
