మహిళలు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగాలి

అవసరమైన శిక్షణ, పెట్టుబడి సహకారం అందిస్తాం.. సబ్‌ కలెక్టర్‌ ఉమా హారతి

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: పొదుపు సంఘాల మహిళలు కేవలం సభ్యులుగా మాత్రమే పరిమితం కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్‌డీఓ) ఎన్‌.ఉమా హారతి పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య 110వ సమావేశం జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు యోగేశ్వరి అధ్యక్షతన గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమా హారతి మాట్లాడుతూ.. పొదుపు సంఘాలు వ్యాపార కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలని, మహిళా సమాఖ్యలు కేవలం రుణాల పంపిణీకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ రాణించాలని సూచించారు.

ఆదాయం సమకూర్చే కార్యక్రమాలు చేపట్టాలి

ప్రతి మండల సమాఖ్య ఆదాయం సమకూర్చేలా నూతన వ్యాపార కార్యక్రమాలను చేపట్టాలని ఉమా హారతి సూచించారు. ఇందుకు అవసరమైన శిక్షణతో పాటు పెట్టుబడి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వచ్చే నెల జరిగే సమావేశానికి వ్యాపారాభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రతిపాదనలతో రావాలని, ఈ బాధ్యతను డీపీఎంలు తీసుకోవాలని ఆదేశించారు. మండల సమాఖ్యలకు మంజూరైన భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీఓలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, వీబీజీ రామ్‌ జీ పథకం ద్వారా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవడంతో పాటు అవకాశం ఉన్నవారు నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డీపీఎంలు సెర్ప్‌ కార్యక్రమాల అమలుపై సమావేశానికి హాజరైన వారికి అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపు డీఆర్‌డీఓ సూర్యారావు, జిల్లాలోని 23 మండల సమాఖ్యల అధ్యక్షులు, డీపీఎంలు పాల్గొన్నారు.