Women Andhra Premier League | 19 నుంచి మంగళగిరిలో ఉమెన్‌ ఏపీఎల్‌

  • 19 నుంచి 27 వరకు ఉమెన్‌ ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌
  • మంగళగిరి ఏసీఏ స్టేడియంలో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లు
  • నాలుగు ఫ్రాంచైజీలతో తొలి ప్రయోగం
  • ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం.. విద్యార్థినులకు ఉచిత బస్సులు
  • మహిళా సాధికారతే లక్ష్యం
  • ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌

విజయవాడ, ఆంధ్రప్రభ: మహిళా క్రికెట్‌లో ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఉమెన్‌ ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో పోటీలు నిర్వహించనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌ తెలిపారు. ఏసీఏ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో లీగ్‌ వివరాలను వెల్లడించారు.

ఫ్రాంచైజీ విధానంలో తొలిసారిగా మహిళల క్రికెట్‌ లీగ్‌ను నిర్వహిస్తున్నామని శివనాథ్‌ చెప్పారు. నాలుగు జట్లు పోటీపడనున్న ఈ లీగ్‌లో అన్ని మ్యాచ్‌లను ఈసారి మంగళగిరి ఏసీఏ స్టేడియంలోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పురుషుల ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ తరహాలో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నామని, ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

విద్యార్థినులకు ప్రత్యేక ఏర్పాట్లు..

మహిళా క్రికెట్‌ను యువతకు చేరువ చేయడంలో భాగంగా విజయవాడ, మంగళగిరి, గుంటూరు పరిసర ప్రాంతాల్లోని మహిళా కళాశాలలు, విద్యాసంస్థల విద్యార్థినులను మ్యాచ్‌లకు తీసుకురావడానికి ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు శివనాథ్‌ తెలిపారు. విద్యార్థినులను స్టేడియానికి తీసుకొచ్చి, మ్యాచ్‌ అనంతరం తిరిగి కళాశాలలకు చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మహిళలు క్రీడల్లో రాణించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

రోజుకో ప్రముఖ మహిళ అతిథి..

లీగ్‌ ప్రారంభోత్సవానికి నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలు, క్రీడాకారిణులు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌ అధికారులు, న్యాయమూర్తులు తదితర వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఒక్కో రోజు ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. వారి అనుభవాలను యువ క్రీడాకారిణులతో పంచుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మహిళా క్రికెట్‌పై అవగాహన పెంచేందుకు విజయవాడ నుంచి మంగళగిరి వరకు మహిళలతో బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ర్యాలీ మార్గాన్ని ఏసీఏ ప్రకటించనుంది.

వచ్చే సీజన్‌లో మరిన్ని వేదికలు..

ప్రస్తుత లీగ్‌లో నాలుగు జట్లు మాత్రమే ఉండటంతో రవాణా, నిర్వహణ అంశాలను దృష్టిలో ఉంచుకుని అన్ని మ్యాచ్‌లను మంగళగిరిలో నిర్వహిస్తున్నట్లు శివనాథ్‌ చెప్పారు. వచ్చే సీజన్‌ నుంచి కడప, విశాఖపట్నం, విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర స్టేడియాలను వినియోగించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జాతీయ జట్టుకు ఆణిముత్యాలు..

ఉమెన్‌ ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ ద్వారా భవిష్యత్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారిణులను తయారు చేయడమే లక్ష్యమని శివనాథ్‌ అన్నారు. రాబోయే మహిళల ఐపీఎల్‌కు కూడా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారిణులు ఎదగాలని ఆకాంక్షించారు. ఆర్థికంగా వెనుకబడిన క్రీడాకారులకు అండగా నిలవడంతో పాటు క్రికెట్‌ అభివృద్ధికి ఏసీఏ కృషి చేస్తుందని చెప్పారు. లీగ్‌ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.

ఈ నెల 27న ఫైనల్‌ మ్యాచ్‌కు ప్రముఖులను ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రారంభ మ్యాచ్‌కు నారా బ్రాహ్మణితో పాటు మహిళా రంగానికి చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమాన ప్రాధాన్యం కల్పించాలన్నదే ఏసీఏ విధానమని శివనాథ్‌ స్పష్టం చేశారు. ఉమెన్‌ ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ విజయవంతానికి ప్రజలు, క్రీడాభిమానులు సహకరించాలని కోరారు.