దేవాదుల చివరి ఆయకట్టుకు సాగునీటి కష్టాలు తీరేనా?
కాలువ పూడికతీతకు రూ.50 లక్షల ప్రతిపాదనలు.. త్వరలో పనులు ప్రారంభం
వర్ధన్నపేట, ఆంధ్రప్రభ: దేవాదుల ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలపై ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు స్పందించారు.
ఇల్లంద గ్రామ రైతులు, ప్రజాప్రతినిధులు ఆయన దృష్టికి కాలువ సమస్యను తీసుకెళ్లగా, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. కాలువలో పూడిక పేరుకుపోవడంతో చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు వివరించారు. దీనిపై దేవాదుల శాఖ ఎస్సీ, ఈఈ, ఏఈలతో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతోనూ ఎమ్మెల్సీ మాట్లాడారు. కాలువ పూడికతీత పనులకు రూ.50 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపించినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. దీంతో చివరి ఆయకట్టు రైతుల్లో సాగునీటి సమస్య పరిష్కారంపై ఆశలు చిగురించాయి.
