గోదావరి జలాలను చంద్రబాబుకు గురుదక్షిణగా ఇస్తారా? : కవిత
గోదావరి జలాలను చంద్రబాబుకు గురుదక్షిణగా ఇస్తారా?
- పోలవరం–బనకచర్ల లింక్‌పై రేవంత్ సర్కారుకు కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్నలు
- తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నారని ఆరోపణ..
- ప్రాజెక్టుపై కేంద్రంతో సంప్రదింపుల నుంచి వైదొలగాలని డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నదుల అనుసంధానం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని, ఒకవైపు సమ్మక్క సాగర్ నుంచి గోదావరి–కావేరి అనుసంధానాన్ని చేపట్టాలని అధికారులు కోరుతుంటే.. మరోవైపు పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమ్మతి తెలిపారంటూ ఆరోపించారు. ఈ పరిణామాలు ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
ప్రభుత్వ వైఖరిపై నిలదీత
జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) నుంచి చేపట్టాలని తెలంగాణ అధికారులు కోరినట్లు కవిత పేర్కొన్నారు. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు రేవంత్‌రెడ్డి అంగీకారం తెలిపారంటూ విమర్శించారు. నదీ జలాల వినియోగంపై ప్రభుత్వానికి నిర్దిష్టమైన విధానం, స్పష్టమైన అవగాహన లేవని ఆరోపించారు.
250 టీఎంసీల నీటిని వదులుకుంటారా?
తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన 250 టీఎంసీల గోదావరి జలాలను చంద్రబాబుకు గురుదక్షిణగా ఇస్తున్నారా? అంటూ కవిత ఘాటుగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమక్షంలో జరిగిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలోనూ పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు రేవంత్‌రెడ్డి అంగీకారం తెలిపారని, అనంతరం మీడియా ముందు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడారని విమర్శించారు.
2024లోనే వ్యతిరేకించాం
పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు నష్టం కలిగిస్తుందని మొదటినుంచీ తాము చెబుతున్నామని కవిత గుర్తుచేశారు. 2024లోనే తెలంగాణ జాగృతి తరఫున ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే అప్రమత్తమై ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. రేవంత్‌రెడ్డి ఆమోదంతోనే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నదుల అనుసంధానంలో భాగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు.
కేంద్రం సంప్రదింపుల నుంచి వైదొలగాలి
ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్లు తెరిచి పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎదురయ్యే ముప్పును గుర్తించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుపై కేంద్రం చేపడుతున్న అన్ని సంప్రదింపుల నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని సూచించారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని కోరారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వెంటనే లేఖ రాయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేశారు.
