Harish Rao | కరెంట్ కోతలు.. ఛార్జీల వాతలు !
- ట్రూ అప్ పేరుతో భారం మోపుతారా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్
- కాంగ్రెస్ పాలన అంటేనే దొంగల పాలన అని మరోసారి ఋజువు అయ్యింది
- అన్నింటికీ ఎల్‌నినో పేరు చెప్పి కుంటి సాకులతో తప్పించుకోవాలని చూస్తున్నారు.
- ఎల్‌నినో వల్ల వర్షాలు పడకపోవచ్చు.. కానీ బొగ్గు ఉత్పత్తి కూడా ఆగిపోతుందా?
- పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి అని హరీశ్ రావు డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : “రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే.. ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు” అని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దసరా, దీపావళి పండుగల వేళ ప్రజలకు శుభవార్త చెప్పాల్సిన ప్రభుత్వం.. విద్యుత్ బిల్లులు పెంచి నెత్తిన పిడుగు వేసిందని విమర్శించారు. ట్రూ అప్ పేరుతో ప్రజల నడ్డి విరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. రూ.5,420 కోట్ల భారాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. “ప్రజల తరఫున నేను రేవంత్‌రెడ్డిని సూటిగా అడుగుతున్నా.. రూ.5,420 కోట్ల విద్యుత్ బిల్లులను వినియోగదారులపై మోపే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?” అని ప్రశ్నించారు.
విద్యుత్ కొనుగోళ్లకు వెచ్చించిన సొమ్మును వినియోగదారుల నుంచే వసూలు చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసమని హరీశ్‌రావు ప్రశ్నించారు. బాధ్యత నుంచి తప్పించుకున్న ప్రభుత్వం.. ఆ భారాన్ని ప్రజలపై వేయడం సిగ్గుచేటన్నారు. “ఇప్పటికే కరెంట్ కోతలతో అల్లాడుతున్న ప్రజలకు.. ఇప్పుడు కరెంట్ బిల్లులు పెంచి వాతలు పెడతారా?” అని నిలదీశారు. ప్రజలపై భారం మోపే కాంగ్రెస్ సర్కారు నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రూ.5 వేల కోట్లకు పైగా భారం మోపాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు.
విద్యుత్ నుంచే తెలంగాణ ఉద్యమం
బషీర్‌బాగ్ కాల్పుల ఘటన జరిగి 26 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని హరీశ్‌రావు ప్రస్తావించారు. కరెంట్ కష్టాలకు చరమగీతం పాడాలని, తెలంగాణ రాష్ట్రం రావాలని కేసీఆర్ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. “విద్యుత్ విషయం నుంచే తెలంగాణ ఉద్యమ పోరాటం మొదలైంది. ఉచిత కరెంట్ అని చెప్పి అర్ధరాత్రి కరెంట్ ఇచ్చేవారు. తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని కిరణ్‌కుమార్‌రెడ్డి కట్టె పట్టుకొని చెప్పిండు. కానీ అవేవీ జరగలేదు. 24 గంటల కరెంట్ ఇస్తామని కేసీఆర్‌గారు అంటే జానారెడ్డిగారు కూడా నమ్మలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది కేసీఆర్‌గారు” అని అన్నారు.
“కానీ నేడు ఎట్లా అయ్యింది? కరెంటు ఉంటే వార్త అయ్యింది. ఈరోజు రాష్ట్రంలో ఒక తుగ్లక్ పాలన నడుస్తున్నది. స్వయంగా ముఖ్యమంత్రి.. పరిపాలన చేతగాక చేతులెత్తేసిన పరిస్థితి” అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. పరిపాలనపై ధ్యాస లేదనడానికి సంక్షోభంలో కూరుకుపోతున్న విద్యుత్ రంగమే నిదర్శనమన్నారు. తప్పు చేసింది కాంగ్రెస్ అని, విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టింది కాంగ్రెస్ అని ఆరోపించారు. “కానీ భారం మాత్రం ప్రజలపై వేస్తున్నరు. కరెంట్ సరఫరా చేయలేని చేతగాని సర్కారు.. బిల్లులు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నది” అని విమర్శించారు.
రూ.12,718 కోట్ల భారం వేసే అవకాశం ఉన్నా.. వేయలేదు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని హరీశ్‌రావు అన్నారు. 2016-17 నుంచి 2021-22 వరకు ట్రూ అప్ ఛార్జీల కింద రూ.12,718.40 కోట్లు వసూలు చేయాలని ఈఆర్‌సీ చెప్పినా.. ఆ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు కేసీఆర్ అనుమతించలేదన్నారు. “విద్యుత్ సంస్థల భారాన్ని ప్రజలపై వేయొద్దు అని ఖరాఖండిగా తేల్చి చెప్పారు” అని గుర్తుచేశారు. “కానీ ఈరోజు రేవంత్‌రెడ్డి కరువు పరిస్థితుల్లో ప్రజలపై రూ.5,200 కోట్ల భారం వేస్తున్నడు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజా పీడన” అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ రంగానికి రూ.91 వేల కోట్లు వెచ్చించి జెన్‌కో, ట్రాన్స్‌కోతో పాటు మౌలిక వసతులను బలోపేతం చేసిందని తెలిపారు. 400 కేవీ సబ్‌స్టేషన్లు 6 నుంచి 30కి, 220 కేవీ సబ్‌స్టేషన్లు 51 నుంచి 103కి, 132 కేవీ సబ్‌స్టేషన్లు 176 నుంచి 251కి పెంచామని చెప్పారు. ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్లు 233 నుంచి 384కు, ఈహెచ్‌టీ లైన్ల సర్క్యూట్ 16,378 కిలోమీటర్ల నుంచి 28,131 కిలోమీటర్లకు పెంచామని వివరించారు. ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యాన్ని 14,973 ఎంవీఏ నుంచి 38,941 ఎంవీఏకు పెంచామని, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,450 మెగావాట్లకు పెంచామని తెలిపారు.
పవర్‌ఫుల్ తెలంగాణను.. కరెంట్ కోతల తెలంగాణగా మార్చారు
కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్లాంట్‌ను 42 నెలల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించామని హరీశ్‌రావు అన్నారు. భద్రాద్రిలో 1,080 మెగావాట్ల ప్లాంట్, 4,000 మెగావాట్ల అల్ట్రా థర్మల్ ప్లాంట్, భూపాలపల్లిలో 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఒక్క థర్మల్ రంగంలోనే 6,480 మెగావాట్లు, సోలార్‌లో 3,600 మెగావాట్లు అదనంగా తీసుకొచ్చామని తెలిపారు. సింగరేణి మరో 800 మెగావాట్ల విషయంలో రాజస్థాన్‌తో జాయింట్ వెంచర్ చేసుకుందని పేర్కొన్నారు.
“అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేసిన కొత్త పని ఒక్కటీ లేదు. కొత్తగా ఒక్క సబ్‌స్టేషన్ కట్టింది లేదు.. కొత్తగా ఒక్క మెగావాటు ఉత్పత్తి సామర్థ్యం పెంచింది లేదు” అని హరీశ్‌రావు ఆరోపించారు. “కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫుల్‌గా ఉన్న కరెంట్ ఇప్పుడు ఎందుకు నిల్ అయ్యింది? కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ వస్తే.. ఇప్పుడు ఎందుకు 6 గంటలు కూడా కరెంట్ రాని పరిస్థితి వచ్చింది?” అని ప్రశ్నించారు.
ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ కరువు
“అన్నింటికి ఒకే మంత్రం అన్నట్లు మీ పాలన వైఫల్యాన్ని, చేతగాని తనానికి ఎల్‌నినో పేరు చెప్పి, కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటారా? ఎల్‌నినోకు బొగ్గు ఉత్పత్తికి కారణం ఏమిటి?” అని హరీశ్‌రావు నిలదీశారు. దేవాదులలో 24 గంటల మోటార్లు నడపాల్సి ఉంటే 8 గంటలే నడుపుతున్నారని, దీంతో వరంగల్ జిల్లాకు కరువు వచ్చిందని ఆరోపించారు. “ఎల్‌నినో కరువు కాదు.. కాంగ్రెస్ కరువు” అని అన్నారు.
కల్వకుర్తి ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేశారని, నీళ్లు ఎత్తాలని చెప్పినా 8 గంటలే మోటార్లు నడుపుతున్నారని విమర్శించారు. కన్నెపల్లి దగ్గర కట్క ఎత్తితే నీళ్లు వస్తాయని, లిఫ్ట్ చేయాలని అడిగితే ఎన్‌డీఎస్‌ఏ కారణాలు చెప్పిందని, అయితే ఆ ఎన్‌డీఎస్‌ఏకే సమాధానం చెప్పేలా పరిస్థితి మారిందన్నారు. “ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు” అని వ్యాఖ్యానించారు.
భద్రాద్రి, యాదాద్రి, సింగరేణి థర్మల్, కేటీపీఎస్ విద్యుత్ కేంద్రాలను నిర్మించినా వాటిని నడిపే తెలివి ప్రభుత్వానికి లేదని హరీశ్‌రావు విమర్శించారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో మూడో యూనిట్ ఉత్పత్తి ఎందుకు నిలిచిపోయిందని ప్రశ్నించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ సామర్థ్యం 4,000 మెగావాట్లు ఉంటే 400 మెగావాట్లు కూడా ఉత్పత్తి చేయడం లేదన్నారు. సింగరేణి బొగ్గు సంస్థ ఉండి కూడా సింగరేణి థర్మల్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేయలేని పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.
బొగ్గు ఉన్నా.. కరెంట్ ఉత్పత్తి చేయరు
“నదుల్లో నీళ్లు ఉన్నా రిజర్వాయర్లు నింపలేదు. నీళ్లు లిఫ్ట్ చేయలేదు. బొగ్గు ఉన్నా సరఫరా చేయరు.. కరెంట్ ఉత్పత్తి చేయరు” అని హరీశ్‌రావు అన్నారు. రూ.1,600 కోట్లు విలువ చేసే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు మాయమయ్యాయని, ఇది పెద్ద కుంభకోణమని తాము ముందునుంచే హెచ్చరించామని చెప్పారు. లేని నిల్వలు ఉన్నట్లు చూపి పన్ను, కోల్ సెస్, సీఎస్‌ఆర్ చెల్లింపులు చేసి మోసం చేశారని సింగరేణిలో పర్యటించి ప్రజెంటేషన్ ఇచ్చామని తెలిపారు.
“ఇప్పుడు ఏం అయ్యింది? బొగ్గు నిల్వలు లేవన్న విషయం తేటతెల్లం అయ్యింది. అప్పుడు బొగ్గు కుప్పల మీద సేల్ బొగ్గు వేసి కవర్ చేసే ప్రయత్నం చేసారు. మరి ఇప్పుడు ఎల్‌నినో వల్లే కరెంట్ ఉండటం లేదని కారణం చెబుతున్నారు” అని విమర్శించారు.
రైతులకు కరెంట్ లేదు.. నీళ్లు లేవు
పాలన తక్కువ.. ప్రతిపక్షాలపై బురదజల్లడం ఎక్కువైందని హరీశ్‌రావు మండిపడ్డారు. రైతులకు అనేక ఇబ్బందులు ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. “మీ నిర్లక్ష్యం, మీరు చేసిన పాప ఫలితం ఈరోజు రాష్ట్రంలో కరెంట్ సంక్షోభం. ఉచిత కరెంట్ పేటెంట్ కాదు.. పేషెంట్ అయ్యింది” అని వ్యాఖ్యానించారు.
“ఈరోజు రైతుల పరిస్థితి ఎట్లుందంటే.. చేతికి వచ్చే పంటను కాపాడుకుందాం అంటే కరెంట్ లేదు.. నీళ్లు లేవు. కడుపు మండిన రైతులు సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నరు. గ్రామీణ ప్రాంత రైతులు కరెంట్ కోసం పోరాటాలు చేస్తున్నరు. నీ కొండారెడ్డిపల్లిలోనే రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే నీకు కనిపించడం లేదా రేవంత్‌రెడ్డి?” అని ప్రశ్నించారు. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియక పొలాల వద్ద వేచి చూస్తూ పాముకాట్లకు గురై రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.
కరెంట్ కోతలు, లోఓల్టేజీ సమస్యతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఉమ్మడి పాలనలో క్రాప్ హాలిడే, పవర్ హాలిడేలను చూశామని, రేవంత్‌రెడ్డి పాలనలో మళ్లీ అవే రోజులు వస్తున్నాయని విమర్శించారు. “ఆనాటి రోజులు తెస్తాం అన్న రేవంత్‌రెడ్డి.. నిజంగానే ఆనాటి కరెంట్ కోతల రోజులు తెచ్చిండు” అని అన్నారు.
అడ్డగోలుగా విద్యుత్ కొనుగోలు చేసి.. భారం ప్రజలపై వేస్తారా?
కేసీఆర్ ప్రభుత్వం రోజుకు 140 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యవస్థను ఏర్పాటు చేసిందని, ఇప్పుడు అందులో 100 నుంచి 110 మిలియన్ యూనిట్లు కూడా ఉత్పత్తి చేయడం లేదని హరీశ్‌రావు అన్నారు. బొగ్గు లేక, నీళ్లు లేక, సరైన నిర్వహణ లేక ఉత్పత్తి తగ్గిందని ఆరోపించారు. యాదాద్రి జనరేషన్ సామర్థ్యం 96 మిలియన్ యూనిట్లు అయితే 39 మిలియన్ యూనిట్లు కూడా దాటడం లేదన్నారు.
“ఉన్న కెపాసిటీని వినియోగించే తెలివి లేదు.. బయట నుంచి రూ.10, రూ.12కు యూనిట్ కొని ప్రజలపై భారం వేస్తారా? అడ్డగోలుగా విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై భారం మోపుతారా?” అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం థర్మల్ విద్యుత్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ 13,384 మెగావాట్లు ఉంటే 8,000 మెగావాట్లు కూడా ఉత్పత్తి చేయడం లేదని, 40 నుంచి 45 శాతం గ్యాప్ ఉందని పేర్కొన్నారు. “ఇది నిర్వహణ లోపం కాకుంటే ఏమిటి రేవంత్‌రెడ్డి?” అని నిలదీశారు.
నైనీలో మంచి నాణ్యత కలిగిన బొగ్గు అందుబాటులో ఉన్నా.. దాన్ని వినియోగించకుండా విదేశాల నుంచి అధిక ధరకు బొగ్గు దిగుమతి చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వల వ్యవహారంపై తాము ప్రశ్నించినా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాసినా చర్యలు తీసుకోలేదని అన్నారు.
ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపాలి
ఇదే సమయంలో ట్రాన్స్‌కోను ప్రైవేటీకరించే నిర్ణయం తీసుకున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. వేల కోట్ల విలువైన రాష్ట్ర విద్యుత్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్‌ను అమ్మేందుకు సిద్ధమయ్యారని, 26 శాతం వాటాల విక్రయానికి నిర్ణయించుకున్నారని అన్నారు. టీజీ-ట్రాన్స్‌కో, టీజీ-జెన్‌కో, సింగరేణి, డిస్కంలను ప్రైవేటీకరించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
“రాహుల్‌గాంధీ ఏమో పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయొద్దని అంటడు.. సీడబ్ల్యూసీలో తీర్మానాలు చేస్తరు. కానీ ఇక్కడేమో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తరట” అని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ హయాంలో థర్మల్ పవర్ స్టేషన్లను ప్రైవేటు వాళ్లు పెడతామని వచ్చినా అంగీకరించలేదని, యాదాద్రి, భద్రాద్రి, సింగరేణి ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేశామని చెప్పారు. ఇప్పటికే యాదాద్రిలో యాష్, కోల్ ప్లాంట్ల ప్రైవేటీకరణ పూర్తయిందని ఆరోపించారు. విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ ఛార్జీల పెంపు వెనక్కి తీసుకోవాలి
“బొగ్గు నిల్వలు చేసుకోవడంలో కాంగ్రెస్ ఫెయిల్. రిజర్వాయర్లు నింపి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్. హైడల్ విద్యుత్ ఉత్పత్తి చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్. మరి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి?” అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కరెంట్ కోతలు కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిదర్శనమని, బిల్లుల భారం ఆ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానానికి నిదర్శనమని అన్నారు.
“నాడు కోతలు పెడితే, కరెంట్ ధరలు పెంచితే ప్రజలు షాక్ ఇచ్చారు. నేడు నువ్వు ధరల నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే షాక్ తప్పదు” అని రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. “ఎవరు ఆదేశిస్తే ఈ నిర్ణయాలు అమలు చేస్తున్నావు రేవంత్‌రెడ్డి?” అని ప్రశ్నించారు. ఆనాడు విద్యుత్ బిల్లులపై పోరాటం చేసిన కమ్యూనిస్టులు.. నేడు రేవంత్‌రెడ్డి చేసే పాపంలో పాలుపంచుకోవద్దని, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ చేసే పోరాటంలో కలిసి రావాలని కోరారు.
ట్రూ అప్ పేరుతో ప్రజలపై మోపే విద్యుత్ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని, రూ.5,420 కోట్ల ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని బీఆర్‌ఎస్ తరఫున డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే మరో ప్రజా పోరాటానికి బీఆర్‌ఎస్ సిద్ధమవుతుందని హరీశ్‌రావు హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని హరీశ్‌రావు మరో ప్రకటనలో విమర్శించారు. కేవలం నాలుగు నెలల్లోనే సన్నబియ్యం ధరలు 25 శాతం పెరిగాయని, ఇది ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని ప్రభుత్వం చెబుతున్నప్పుడు.. ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గాల్సి ఉండగా బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల అక్రమ నిల్వలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సామాన్యులను ఇబ్బంది పెడుతున్న ధరలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
