వన్యప్రాణుల సంరక్షణ అంద‌రి బాధ్యత

పెద్దపల్లి ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సతీష్‌కుమార్‌
పెద్దపల్లి రూరల్:
వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పెద్దపల్లి ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ టి. సతీష్‌కుమార్‌ అన్నారు. అడవులను నరికివేయడం, వన్యప్రాణులను వేటాడటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. అక్రమంగా వేటకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శనివారం పెద్దపల్లి, మంథని అటవీ రేంజ్‌ సిబ్బంది, పెద్దపల్లి పోలీసులతో కలిసి మండలంలోని కుర్మపల్లి గ్రామంలో సంయుక్తంగా కార్డన్‌ సెర్చ్‌, దాడులు నిర్వహించారు. ఈ మేరకు వేటకు ఉపయోగించే వలలు, క్లచ్‌ వైర్లు, జాలీలు, ఉచ్చులు, కత్తులు, ఇనుప కేజీలు, నైలాన్‌ తాళ్లు, బైండింగ్‌ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తుల‌తో వన్యప్రాణి వారోత్సవాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. అటవీ సంపదను కాపాడటంలో ప్రజలు భాగస్వాములు కావాలని సతీష్‌కుమార్‌ సూచించారు. వన్యప్రాణుల వేటకు సంబంధించిన సమాచారం తెలిస్తే అటవీశాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు. అనంతరం బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో అటవీశాఖ సిబ్బంది శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాల్లో మంథని అటవీ క్షేత్ర అధికారి ఎం. వినయ్‌నాయక్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారులు పి. దేవదాస్‌, ఎన్‌. రమేష్‌, జె. తిరుపతి, సెక్షన్‌ అధికారులు జి. కొమురయ్య, ఎస్‌.డి. రహమతుల్లా, ఎం. నర్సయ్య, హెచ్‌. మంగీలాల్‌, ఎండీ అమిరుద్దీన్‌, రవి, ముదస్సర్‌ షా, బీట్‌ అధికారులు జి. రామ్మూర్తి, ఎస్‌. మెగరాజ్‌, పవన్‌, ప్రదీప్‌, తిరుపతి, మాధురి, రంజిత్‌, శ్రీకాంత్‌, అక్తర్‌ పాషా, రామ్‌సింగ్‌, తదితరులు పాల్గొన్నారు.