భర్త కోసం భార్య పోరాటం.. అత్తవారింటి ఎదుట మౌన దీక్ష

  • పది రోజులుగా దీక్ష.. పట్టించుకునే వారే లేరు
  • కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న భర్త
  • మహిళను పరామర్శించిన ఐద్వా నాయకులు

నరసాపురం, ఆంధ్రప్రభ: ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్న భర్తతో కాపురం సజావుగా సాగాలని కోరుతూ ఓ మహిళ అత్తవారింటి ఎదుట దీక్షకు దిగింది. తనతోనే భర్త కలిసి ఉండాలని కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినా భర్త పట్టించుకోవడం లేదని బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషాదకర ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం ఎల్బీ చర్ల గ్రామం పరిధిలోని బైనపాలెం ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఐద్వా (AIDWA) జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బైనపాలెంకు చెందిన కొమరాడ శ్రీనివాసు, పద్మావతి దంపతుల కుమారుడు కొమరాడ దుర్గాప్రసాద్‌కు, దేవి దివ్యతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నకానుకలుగా రూ.5 లక్షల నగదు, 12 సెంట్ల భూమిని ఇచ్చారు.

అయితే, ఏడాది పాటు భార్యతో కాపురం చేసిన దుర్గాప్రసాద్, అనంతరం ‘ఆమె నచ్చలేదు’ అంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన న్యాయస్థానం భార్యతోనే కలిసి కాపురం చేయాలని తీర్పునిచ్చింది. అయినప్పటికీ, భర్త కోర్టు తీర్పును ధిక్కరించి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, భార్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కాపురం చేయనని తెగేసి చెప్పాడు.

న్యాయం కోసం రోడ్డుపైనే పది రోజులుగా పోరాటం

భర్త తీరుతో తీవ్ర అన్యాయానికి గురైన దివ్య, తనకు న్యాయం కావాలంటూ గత పది రోజులుగా అత్తవారింటి ముందే దీక్ష చేపడుతోంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, దోమల మధ్య రోడ్డుపైనే కాలాన్ని వెళ్లదీస్తోంది.

బాధితురాలికి ఐద్వా నాయకులు శుక్రవారం మద్దతు తెలిపి పరామర్శించారు. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ.. పోలీసుల, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అధికారులు ఈ సమస్యను పరిష్కరించకపోగా, అక్కడి నుంచి వెళ్ళిపోవాలని బాధితురాలిని బెదిరిస్తున్నారని ఆరోపించారు.

“ఇక్కడ ఉండటానికి వీల్లేదు, బ్యానర్లు పెట్టొద్దు, టెంట్‌ వేసుకోవడానికి వీల్లేదు.. అసలు ఈ ఇల్లు నీదా?” అంటూ బాధితురాలిని అవమానకరంగా వేధిస్తున్నారని పూర్ణ మండిపడ్డారు. పెద్దల సమక్షంలో భార్యను కాపురానికి తీసుకెళ్తానని ఒప్పుకున్న దుర్గాప్రసాద్, ఇప్పుడు మాట మారుస్తున్నాడని తెలిపారు. తనకు న్యాయం జరగకపోతే ఇక్కడే ప్రాణాలు వదులుతానని, ఇక్కడి నుంచి వెళ్లేదే లేదని బాధితురాలు కన్నీరు మున్నీరవుతోంది.