UP | భర్తను చంపి.. పాముకాటుగా చిత్రీకరణ..
UP | భర్తను చంపి.. పాముకాటుగా చిత్రీకరణ..
వివాహేతర సంబంధమే కారణం..
భార్య, ప్రియుడికి మరణశిక్ష
UP | ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో భర్త హత్య కేసులో స్థానిక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హత్య చేసి, ఆ ఘటనను పాముకాటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భార్య రవిత, ఆమె ప్రియుడు అమర్‌దీప్‌లకు మరణశిక్ష విధించింది. నేరం జరిగిన ఏడాదిన్నరలోపే న్యాయస్థానం తీర్పు వెలువరించడం గమనార్హం.
పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం.. బహసుమ ప్రాంతంలోని అక్బర్‌పూర్ సాదత్ గ్రామానికి చెందిన అమిత్ కశ్యప్‌ను 2025 ఏప్రిల్ 12న రాత్రి అతని భార్య రవిత, ఆమె ప్రియుడు అమర్‌దీప్ కలిసి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పామును వదిలి, అమిత్ పాముకాటు వల్లే మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అమిత్‌ది హత్యగా తేలడంతో ఈ ఘటన వెనుక ఉన్న అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుల ఫోన్ కాల్ డేటా రికార్డులను పరిశీలించారు. హత్య జరిగిన రోజున రవిత, అమర్‌దీప్ ఒకరితో ఒకరు 50 సార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు గుర్తించారు. ఈ ఆధారాలతో పాటు ఇతర సాక్ష్యాలను సేకరించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నేరం జరిగిన 60 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా 12 మందికి పైగా సాక్షులను న్యాయస్థానం విచారించింది. అక్టోబర్ 7న రవిత, అమర్‌దీప్‌లను దోషులుగా నిర్ధారించింది. తాజాగా వారికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
శిక్ష ఖరారు చేసే ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి దోషులతో మాట్లాడారు. తమ పిల్లలను, వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవాల్సి ఉందని పేర్కొంటూ శిక్షలో ఉపశమనం కల్పించాలని రవిత, అమర్‌దీప్ కోరినట్లు సమాచారం. అయితే కోర్టు వారికి మరణశిక్ష విధించింది.
ఇటీవల మీరట్‌లో వెలుగుచూసిన బ్లూ డ్రమ్ హత్య కేసులోనూ మరణశిక్ష విధించడంతో ఈ ప్రాంతంలో వరుసగా వెలువడుతున్న తీర్పులు చర్చనీయాంశంగా మారాయి. గత మూడు రోజుల్లోనే మీరట్‌లో నలుగురు దోషులకు మరణశిక్ష పడినట్లు సమాచారం.
