దేవుడు ఉన్నాడంటారు. ఉంటే మాకు ఎందుకు కనిపించడం లేదు. ప్రపంచంలోని అన్ని వస్తువులూ కనిపిస్తూనే ఉన్నాయి కదా! దేవుడు మాత్రం ఎందుకు కానరాడు. ఈ ప్రశ్న పిల్లలకూ కొందరు పెద్దవారికీ ఉదయించే ప్రశ్న! మా కళ్లకు కనిపిస్తే ఇంకెంతో విశ్వాసం కలుగుతుంది కదా అంటారు. అయితే, ఈ ప్రపంచంలో మనకు కనిపించని ఎన్నో వస్తువులు ఉన్నా, జనులు వాటిని విశ్వసిస్తూ ఉన్నారు కదా. గాలి కనిపించదు, ఆకాశం కనిపించదు, అంతవరకూ ఎందుకు? ఎవరి కన్ను వారికి కనిపించదు, ఎవరి వీపు వారికి కనిపించదు. స్థూలమైన వస్తువులే కొన్ని కనిపించకుండా ఉంటే, ఇక సూక్ష్మాతిసూక్ష్మమైన మనస్సు కూడా అవలోకించనట్టి ఆత్మ భౌతిక నేత్రాలకు ఏవిధంగా కనిపిస్తుంది? అది కనిపించనంత మాత్రాన అది లేదు అంటామా? మహనీయులు పరమాత్మను అతి సూక్ష్మమైన విజ్ఞాన నేత్రంచే ఏకాగ్ర బుద్ధిచే పరమాత్మను చూడగలుగుతున్నారని శ్రుతులు పేర్కొంటున్నాయి. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు రణరంగంలో విశ్వరూపాన్ని చూపమని ప్రార్ధించగా…
నతమాం శక్యశే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా
దివ్యందదాదీతే చక్షు: పశ్య మే రూపమైశ్వరమ్
…ఓ అర్జునా, ఈ చర్మ నేత్రముచే నీవు విశ్వరూపమును చూడలేవు. నీకు దివ్య నేత్రమును ప్రసదిస్తున్నాను. దానితో నీవు దానిని చూడగలవని చెప్పి, భక్తుని మీద గల వాత్సల్యాతిశయంతో దివ్య చక్షువులను ప్రసాదించాడు. ఆ దివ్య నేత్రములతో అర్జునుడు భగవానుని అద్భుత విశ్వరూపాన్ని చూడగలిగాడు. కావున దైవదర్శనం (ఆత్మ సాక్షాత్కారం) భౌతిక నేత్రము ద్వారా వీలుపడదు. దానికి ఈ చర్మ నేత్రాల ద్వారా కాకుండా, దివ్య నేత్రం, జ్ఞాననేత్రం అవసరమవుతుంది. స్థూల వస్తువు సూక్ష్మ వస్తువును ఎప్పటికీ చూడజాలదు. భగవద్దర్శనానికి జీవుడు జ్ఞాన నేత్రాన్ని తప్పక సంపాదించాల్సి ఉంది.
జ్ఞాన నేత్రం ఎక్కడ లభిస్తుంది? భౌతిక పదార్ధాల వలె బయట లభించే వస్తువు కాదు. అది మనలోనే ఉండే వస్తువు. అది లోని వస్తువు. నిత్యానిత్య వివేకమే జ్ఞాన నేత్రం! ఆత్మానాత్మ వివేకమే జ్ఞాన నేత్రం! ఉదాహరణకు మనం పూలమాలలో పూలను ఈ చర్మ నేత్రం చూస్తోంది. లోపల దారాన్ని చర్మ చక్షువు కాకుండా జ్ఞానచక్షువు చూడగలుగుతోంది. మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు కేవలం అతని శరీరం బాహ్య స్వరూపాన్ని మాత్రమే చూడగలుగుతున్నాం. రక్త మాంసమయమైన బాహ్య ఆకృతిని ఈ కన్ను చూడగలుగుతూ ఉంది. కాని, లోపల వెలుగుతున్న శాశ్వత పరమాత్మను, ఆ దివ్యమైన ఆత్మ స్వరూపాన్ని జ్ఞాన నేత్రం మాత్రమే వీక్షిస్తూ ఉంది. ఈ భౌతిక నేత్రాలకు కనిపించని అతి సూక్ష్మమైన పదార్ధాన్ని తెలుసుకొనగలిగే వివేకమే జ్ఞాన నేత్రం. ఈ జ్ఞాన నేత్రం ప్రస్తావన ఉపనిషత్తులలోను, భగవద్గీతలోను, తదితర శాస్త్ర గ్రంధాలలోను అక్కడక్కడ కనిపిస్తుంది. శంకర భగవత్పాదులు…
దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్… అన్నారు.
అంటే, నీ దృష్టిని జ్ఞానమయంగా ఓనర్చుకుని, జ్ఞాననేత్రాన్ని సంపాదించుకుని ప్రపంచమంతా బ్రహ్మమయంగా చూడమన్నారు.
అజ్ఞానంతో దృష్టి అపవిత్రమై పోవడం వల్ల, జనులకు ప్రపంచం వక్రంగా కనిపిస్తోంది. ఆ దృష్టిని శుద్ధపరచుకోవాల్సి ఉంది. స్వానుభవం చేతనే వినిర్మలమొనర్చుకుంటే ప్రపంచం… ప్రపంచ రూపమే కాకుండా, దైవరూపంగా కనిపిస్తుంది! అలాంటి స్థితిని సాధించుకునేందుకే మానవ జన్మ ఏర్పడింది. జ్ఞాన నేత్ర సంపాదన కోసమే మహోన్నతమైన మనుష్యత్వాన్ని సార్ధక్యపరచుకోవడం విద్యుక్తధర్మంగా భావించాలి. అయితే, ముందుగా మనం వ్యక్తితత్వాన్ని చక్కగా అలవరచుకోవాల్సి ఉంది. పూజ, జప ధ్యానాదుల ద్వారా భగవంతుని ఉపాసించాలి. భగవంతుడు కరుణామయుడు. మన భక్తికి మెచ్చి బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాడు. ఈ బుద్ధి యోగమే జ్ఞాననేత్రం… దివ్యనేత్రం!
అలాంటి నేత్రాన్ని ఒక్క అర్జునుడే కాదు, అనన్య భక్తి కలిగి ఉన్న వారు ఎవరైనా పొందవచ్చునని శ్రీకృష్ణభగవానుల వారే సెలవిచ్చారు. కాబట్టి, అతి సులభమైన భక్తిని చేపట్టి, స్వామి కృపకు పాత్రులై, భగవదనుగ్రహం చేత జ్ఞాన నేత్రాన్ని పొందాలి. ఆత్మయందు మనస్సును నిలిపి నిరతిశయ ఆత్మానందానుభూతిచే జీవితాన్ని సార్ధక్యం చేసుకోవాలి.
- డాక్టర్ పులివర్తి కృష్ణమూర్తి