ఖాళీ కానున్న ఎమ్మెల్సీ పదవులు ఎవరెవరికి? కాంగ్రెస్‌లో ఆశావహులు పోటాపోటీ!
- మరోసారి తెరపైకి సామాజిక సమీకరణాలు.. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహానికి పదును
- ఐదు ఎమ్మెల్సీ స్థానాల అనేక మంది గురి.. నేతల్లో పెరుగుతున్న ఆశలు
- ఎన్నికల ద్వారా భర్తీ అయ్యే రెండు స్థానాలకు సత్తా చాటిన నేతలకే ఛాన్స్?
- గవర్నర్ కోటాలో మూడు స్థానాలు.. తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి ప్రాధాన్యం?
హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : తెలంగాణలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ మరోసారి రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తం ఐదు స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో, ఆయా స్థానాలను ఎవరికి కేటాయించాలన్న అంశంపై అధికార కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది. ఐదు స్థానాల్లో రెండు స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ఉండగా.. మరో మూడు స్థానాలు గవర్నర్ కోటాలో నామినేట్ పద్ధతిలో భర్తీ కానున్నాయి. దీంతో పార్టీ కోసం పనిచేసిన నేతలతో పాటు వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే అంశం కూడా కీలకంగా మారనుంది. ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో పదవులు ఆశించిన నేతలకు ఇప్పటివరకు అవకాశం దక్కని పరిస్థితిలో.. తాజా ఖాళీలు ఆశావహుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేసిన నేతలు, ఎన్నికల సమయంలో పార్టీ కోసం వ్యయ, ప్రయాసలకు ఓర్చి పనిచేసిన నాయకులు తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ద్వారా భర్తీ అయ్యే రెండు ఎమ్మెల్సీ స్థానాల విషయంలో పార్టీ వ్యూహం భిన్నంగా ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ప్రత్యక్ష ఎన్నికల ప్రక్రియలో పోటీ చేసి రాజకీయంగా తమ సత్తా చాటగలిగే నాయకులకు ఈ స్థానాల్లో అవకాశం కల్పించే అంశాన్ని కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అయితే, ఈ స్థానాల కోసం పోటీ పడుతున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, పార్టీ అధిష్ఠానం ఎలాంటి సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ కోటాలో భర్తీ కానున్న మూడు స్థానాల విషయంలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్నవారు, ఉద్యమ కాలం నుంచి ప్రజా జీవితంలో కొనసాగుతున్నవారికి ప్రాతినిధ్యం కల్పించే అంశం పరిశీలనలో ఉన్నట్లు-, ఆ సామాజిక సమీకరణాలతోనే అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వివిధ స్థాయిల్లో పనిచేసిన పలువురు నేతలు.. రాష్ట్ర ఏర్పాటు- తర్వాత కూడా తమకు తగిన రాజకీయ గుర్తింపు దక్కలేదన్న అభిప్రాయంతో అనేక మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా పదవులను అలాంటి వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
బలహీన వర్గాలకే అవకాశం.. కొండా లక్ష్మణ్ బాపూజీ కుంబానికి ఓ సీటు?
ఈ ఏడాది నవంబర్‌లో మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం పార్టీలో ఊహించని స్థాయిలో పోటీ నెలకొంది. ఇటీవలే ప్రకటించిన పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు రెండింటినీ రెడ్డి సామాజికవర్గానికే కేటాయించడంపై సోషల్ మీడియా వేదికగా, పార్టీ శ్రేణుల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. అందుకే సామాజిక సమీకరణాలను దారిలోకి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్ కోటాలోని స్థానాలను పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కేటాయించే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఈ నామినేషన్లలో తెలంగాణ ఉద్యమకారులకు, త్యాగాలు చేసిన కుటుంబాలకు ప్రాధ్యానమివ్వాలనే నిర్ణయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ తొలితరం ఉద్యమ నేత, ఆత్మగౌరవ ప్రతీక అయిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి గవర్నర్ కోటాలో ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన బాపూజీ కుటుంబానికి, వారి కుమార్తెకు ఈ అవకాశం కల్పించడం ద్వారా అటు- ఉద్యమకారులను గౌరవించినట్లవుతుందని, ఇటు కీలకమైన బీసీ ఓటు బ్యాంకుకు స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
ఈ మూడు స్థానాల భర్తీతో పార్టీలోని అసంతృప్తిని చల్లార్చడమే కాకుండా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పక్కా సామాజిక ప్రాతిపదికను సిద్ధం చేసుకోవాలని అధిష్టానం యోచిస్తోంది. పద్మశాలి, గౌడ, ముదిరాజ్ లేదా ఎస్సీ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించే సీనియర్ నేతలు, కేడర్లో పట్టు-న్న ఉద్యమకారుల పేర్లను నివేదికల రూపంలో సేకరిస్తున్నారు. గ్రాడ్యుయేట్ స్థానాల్లో ఓపెన్ కేటగిరీకి ప్రాధాన్యత లభించడంతో, ఈ నోటిఫికేషన్లో అణగారిన వర్గాలకే పెద్దపీట వేయకపోతే సామాజిక న్యాయం నినాదానికి విఘాతం కలుగుతుందనే అభిప్రాయం పార్టీ అగ్రనేతల్లోనూ నెలకొంది. గవర్నర్ కోటా నామినేషన్ల చట్టబద్ధత, నియామకాల ప్రక్రియపై గతంలో కోర్టు కేసులు నడవడం, సుప్రీంకోర్టు పరిణామాలు కూడా ఈ నామినేషన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. న్యాయపరమైన అంశాలను అధిగమించి, రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి కళలు, సామాజిక సేవ, సాహిత్యం లేదా ప్రజా సేవలో అనుభవం ఉన్న బీసీ, ఎస్సీ నేపథ్యమున్న నాయకుల పేర్లను గవర్నర్ ఆమోదానికి సిఫార్సు చేయాలని మంత్రివర్గం సన్నాహాలు చేస్తోంది.
బీసీలు, ఉద్యమకారులు, మహిళల్లో సానుకూలత లక్ష్యంగా..
వచ్చే నెలలో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై అధికార కాంగ్రెస్‌లో కసరత్తు ఊపందుకుంది. ఇప్పటికే పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభలో ప్రకటించగా.. తాజాగా తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డాక్టర్ పవిత్రవాణి పేరు పరిశీలనలోకి వచ్చినట్లు- సమాచారం. ఈ విషయంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు- తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం అవసరమని కూడా ఆయన స్పష్టం చేసినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవిత్రవాణి పేరు తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో.. ఉద్యమ నేపథ్యం, సామాజిక సమీకరణం రెండింటినీ కలిపే అవకాశం పవిత్రవాణి ఎంపిక ద్వారా లభిస్తుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నాయకులు, వారి కుటుంబాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలనే అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనూ ప్రస్తావించింది. ప్రొఫెసర్ ఎం.కోదండరామ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించడం కూడా ఈ నేపథ్యంలో ప్రస్తావనకు వస్తోంది. 2026 ఏప్రిల్‌లో గవర్నర్ ఆయనతో పాటు- మహ్మద్ అజారుద్దీన్ నియామకాలకు ఆమోదం తెలిపారు. ఇదే క్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కుటు-ంబానికి ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా తెలంగాణ ఉద్యమ వారసత్వాన్ని రాజకీయంగా ప్రదర్శించవచ్చనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
పరిశీలనలో ఉన్న నాయకుల పేర్లు ఇవే…
గతంలో ఎస్సీల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్‌కు అవకాశం దక్కగా.. ఈసారి ఎస్సీ మాదిగ సామాజికవర్గం నుంచి ఒకరికి బెర్త్ ఖాయం అయినట్లు తెలుస్తోంది. మరో పదవి ఓసీల నుంచి బ్రాహ్మణవర్గానికి కేటాయించనున్నట్లు సమాచారం. ఎస్సీ మాదిగ సామాజికవర్గం నుంచి చాలా మంది పేర్లు వినిపిస్తున్నా.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వామి.. దశాబ్దాల రాజకీయ అనుభవం.. రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నేత డా. ఏ. చంద్రశేఖర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఆయనతోపాటు దొమ్మాట సాంబయ్య, మాజీ ఎమ్మెల్యే సంపత్, గజ్జెల కాంతం, దేవని సతీశ్ లాంటి వారి పేర్లు వినిపిస్తున్నా.. వీరందరితో పోలిస్తే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యే అవకాశాలు చంద్రశేఖర్‌కు మెండుగా ఉన్నాయి. ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పనితీరుపై, ముఖ్యంగా వడ్డేపల్లి మున్సిపాలిటీ- ఎన్నికల ఫలితాలు, ఆస్తుల వివాదాలు, సెటిల్‌మెంట్ల ఆరోపణల నేపథ్యంలో సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, గజ్జెల కాంతం గతంలో పార్టీ అధినేతలపై చేసిన వ్యక్తిగత విమర్శలు, క్రమశిక్షణా సంఘం నోటీసుల అంశాలు చర్చకు దారితిస్తున్నాయి. ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ను వ్యతిరేకించి ఇప్పుడు పార్టీలో చేరి ఎమ్మెల్సీ పదవి కోరడంపై విమర్శలు వస్తున్నాయి. ఎస్సీ మాదిగ సామాజికవర్గం నుంచి రేసులో ఉన్న వారి నేపథ్యం బాగలేకపోవడంతో ఇటు- సీఎం, టీ-పీసీసీ, అటు- ఏఐసీసీ చంద్రశేఖర్ అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపే చాన్స్ ఉంది. ఎందుకంటే ఐదు సార్లు ఎమ్మెల్యేగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన సీనియర్ రాజకీయ నాయకుడిగా ఆయనకు పేరుంది. మరోవైపు బీసీల్లో పద్మశాలి సామాజికవర్గం నుంచి ఈరవత్రి అనిల్, పున్నా కైలాష్ నేత, సంగిశెట్టి జగదీశ్ పేర్లు పరిశీలనలో ఉండగా, ఓసీ సామాజికవర్గం నుంచి ఈసారి బ్రాహ్మణ కోటాలో హర్కర వేణుగోపాల్, మల్లాది పవన్ వీరిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. దసరా, దీపావళి తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పలువురు ఆశావహులు ఢిల్లీలో మకాం వేసి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారం వరకు ఈ ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది.
