క్రాస్ ఓటింగ్ కలిసొచ్చేది ఎవరికి…?

క్రాస్ ఓటింగ్ కలిసొచ్చేది ఎవరికి…?

జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అంతా గెలుపు ఓటమిల నిర్థారణకు తమకు ఉన్న ఓటు బలంతో పాటు క్రాస్ ఓటింగ్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు. 2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కేవలం 16వేల ఓట్లతో మాత్రమే గెలుపొందారు. పైగా ఇప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు బదిలి కావడంతో ఎలాగైనా జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అంతే కాకుండా ఉప ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నుంచి హేమాహేమీలు రంగంలోకి దిగారు.

ఈ నేపధ్యంలో హోరాహోరీగా జరుగుతున్న జూబ్లీహిల్స్ పోరులో తమకున్న ఓటు బ్యాంకుతో కష్టసాధ్యమని అన్ని పార్టీలకు స్పష్టం అయ్యింది. దీంతో ఒక్కసారిగా తమ చూపంతా పక్క పార్టీ ఓటర్ల పై పడింది. అందుకే ప్రతి ఎన్నికల్లో ఓటింగ్ తర్వాతనే మాట్లాడుకునే క్రాస్ ఓటింగ్ అంశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం ఎన్నికల కంటే ముందుగానే చర్చించుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా డబ్బు పంపిణీ అనేది సర్వసాధారణంగా మారింది. ఎన్నికలు జరిగే ప్రాంతం, పోటీలో ఉన్న అభ్యర్ధులను బట్టి ఓటర్లకు ఎంత పంపిణి చేయాలి అనేది డిసైడ్ అవుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక పార్టీ 2 వేల నుంచి 3 వరకు పంపిణి చేస్తుండగా మరో పార్టీ మాత్రం ఏకంగా ఒక్కో ఓటుకు 5 వేలు పంపిణి చేస్తున్నట్టుగా వినికిడి.

గతంలో స్థానిక బస్తీలు, కాలనీల్లో తమ పార్టీ నాయకులకు ఓటర్లకు నోట్లు పంపిణి చేసే బాధ్యతను అప్పగించడం ఆనవాయితీగా ఉండేది కానీ.. ఈ ఎన్నికల్లో డబ్బు పంపిణీ పారదర్శంగా ఉండేలా మీడియేటర్ల వ్యవస్థను పార్టీలు రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా సదరు పార్టీ అభ్యర్థి నుంచి నేరుగా ఓటరుకు అందేలా పార్టీలు వ్యూహం రచించడం విశేషం. మొత్తానికి ప్రధాన పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరి.. క్రాస్ ఓటింగ్ ఎవరికి కలిసొస్తుంది..? ఓటరు తీర్పు ఎలా ఉంటుందో.. ఈ నెల 14న తెలియనుంది.

Leave a Reply