ప్రస్తుతం టాలీవుడ్(Tollywood)లో సరైన హిట్స్ లేక ఇబ్బందుల్లో ఉండగా.. ఇండస్ట్రీ తలపై సమ్మె పేరుతో మరో పిడుగు పడింది. తమకు 30శాతం వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు గత మూడు రోజులుగా సమ్మె బాట పట్టారు. సినీ కార్మికులు (Film workers) సమ్మెకు దిగడంతో, తెలుగు సినిమా ఇండస్ట్రీ (Telugu film industry)లో సినిమా షూటింగ్స్ అన్నీ కూడా బంద్ అయ్యాయి. ఇటు నిర్మాతలు వేతనాల పెంపు ఉండబోదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. రెండు వర్గాలు మొండీగా ఉండటంతో సమస్య తీవ్రంగా మారింది.
మూడేళ్లుగా పెంచని వేతనాలు..
ఫిల్మ్ ఇండస్ట్రీ (Film industry) లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు మూడు సంవత్సరాలుగా పెంచలేదని తెలిపారు. మూడు సంవత్సరాలకు గాను 30శాతం పెంచాలని, సంవత్సరానికి 10శాతం చొప్పన పెంచాలని సినీ కార్మిక సంఘం నాయకులు (Cine Workers Union leaders) డిమాండ్ చేస్తున్నారు. సినీ కార్మికులు ప్రతి రోజూ 18 గంటలకు పైగా పనిచేస్తున్నారని, దానికి తగ్గట్లు వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.20వేలకు పైగా ఉన్న కార్మికులు పనికి తగట్టు వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు (Financial difficulties) పడుతున్నారని వివరించారు. సినిమా నిర్మించడంలో కీలకంగా పనిచేస్తున్న కార్మికులు, ఆర్థిక సమస్యల వల్ల.. కుటుంబంతో కలిసి తాము పనిచేసిన సినిమాను కూడా చూడలేని పరిస్థితి నెలకొందన్నారు.
చిరంజీవి ఇంట్లో సమావేశం..
టాలీవుడ్‌లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిర్మాతలు, సినీ కార్మికుల మధ్య వేతనాల వివాదానికి పరిష్కారం చూపేందుకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నడుం బిగించారు. వేతనాల పెంపు విషయంలో సయోధ్య కుదరకపోవడంతో షూటింగ్‌లు (shootings) నిలిచిపోయిన నేపథ్యంలో, ఆయన ఈ సమస్యను చక్కదిద్దేందుకు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా తన నివాసంలో ప్రముఖ నిర్మాతలతో ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ భేటీలో నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, దిల్ రాజు, సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు డిమాండ్ చేస్తున్న 30శాతం వేతనాల పెంపు ఎందుకు సాధ్యపడటం లేదనే వివరాలను నిర్మాతలు (Producers) చిరంజీవికి వివరించారు. ఇప్పటికే తాము 10నుంచి 15 శాతం పెంపునకు సిద్ధంగా ఉన్నామని, అంతకుమించి పెంచితే చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సమావేశం అనంతరం..
చిరంజీవి నివాసంలో నిర్మాతల సమావేశం (meeting) ముగిసిన అనంతరం నిర్మాత (Producer) సి.కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ వివాదంపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని, షూటింగ్‌లు బంద్ కావడం బాధాకరమని చెప్పారని తెలిపారు. సినీ కార్మికుల సమస్యలను కూడా విని పరిష్కారానికి కృషి చేస్తానని చిరంజీవి హామీ ఇచ్చారని ఆయన అన్నారు.
ఈ సమస్యపై రెండు రోజులు వేచి చూద్దామని, అనంతరం తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని చిరంజీవి చెప్పినట్టు సి.కళ్యాణ్ (C.Kalyan) వివరించారు. త్వరలో చిరంజీవి సినీ కార్మిక నాయకులతోనూ భేటీ కానున్నారని, వారి వాదనలు కూడా విన్న తర్వాత ఒక పరిష్కారానికి వస్తారని ఆయన తెలిపారు. చిన్న నిర్మాతల విషయంలోనే ఈ వేతనాల సమస్య వస్తుందని, వారితో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని సి. కళ్యాణ్ పేర్కొన్నారు.