White-House-Press-Secretary-Exit : ప్రెస్ సెక్రటరీ ఔట్! Andhra Prabha Top News
White-House-Press-Secretary-Exit : ప్రెస్ సెక్రటరీ ఔట్! Andhra Prabha Top News
- వైట్‌హౌస్‌లో కలకలం..
- తొలి మీడియా భేటీలోనే రాద్ధాంతం
- కేటీ జకారియా పదవికి ఎసరు
- న్యాయవాది అర్హతలపై వివాదం
- అధ్యక్షుడు ట్రంప్ సూచనతోనే నిష్క్రమణ?
- మధ్యంతర ఎన్నికల వేళ రిపబ్లికన్లకు షాక్
( వాషింగ్టన్: ఆంధ్రప్రభ, ప్రతినిధి )
అమెరికా అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్‌లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడి మీడియా ప్రతినిధిగా కీలక బాధ్యతలు చేపట్టిన కేటీ జకారియా పదవి నుంచి తప్పుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే ఆమె ఎదుర్కొన్న తీవ్ర విమర్శలు, అర్హతలపై తలెత్తిన వివాదాలు చివరకు నిష్క్రమణకు దారితీసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఆమె పదవి నుంచి వైదొలగనున్నట్లు బీబీసీ ధ్రువీకరించింది.
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా మంగళవారం నిర్వహించిన తొలి మీడియా సమావేశమే ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కేవలం 14 నిమిషాల పాటు సాగిన ఆ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలు మూడింటికే ఆమె సమాధానాలిచ్చారు. నోటుపుస్తకంలో రాసుకున్న అంశాలను చదువుతూ మాట్లాడటం, ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సమయంలో తడబడటం విమర్శలకు తావిచ్చాయి. అంతేకాదు.. ఓ సందర్భంలో తన భర్తను అధ్యక్షుడిగా పేర్కొనడం కూడా చర్చనీయాంశమైంది.
ఈ పరిణామాలపై మీడియా నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె వరుస ఇంటర్వ్యూల్లో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆమె న్యాయవిద్య, న్యాయవాదిగా పనిచేసిన అనుభవం, కీలక పదవికి అవసరమైన సన్నద్ధతపై ప్రశ్నలు తలెత్తాయి.
‘ఈ పని నీకు అవసరమా?’.. ట్రంప్ వ్యాఖ్యలు
కేటీ నిష్క్రమణపై అధికారిక ప్రకటన వెలువడటానికి కొన్ని గంటల ముందే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారం మెరైన్ వన్ హెలికాప్టర్ వెలుపల విలేకరులతో మాట్లాడిన ఆయన.. కేటీతో తాను జరిపిన సంభాషణను వెల్లడించారు.
‘‘నేను కేటీని.. ఈ పని నీ కోసమేనా? నిజాయతీగా చెప్పాలంటే, నీకు ఇదంతా అవసరమా? అని అడిగాను. నీకు ఇష్టం లేకపోతే ఈ పని చేయాల్సిన అవసరం లేదు. నేను నీ స్థానంలో ఉంటే మరోసారి ఆలోచించుకునేవాడిని’’ అని చెప్పినట్లు ట్రంప్ వివరించారు.
మీడియా ఆమెను చాలా కఠినంగా, కొన్నిసార్లు దారుణంగా వ్యవహరిస్తోందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత కొద్ది గంటలకే కేటీ పదవి నుంచి వైదొలగనున్నట్లు బీబీసీ వార్తను ధ్రువీకరించింది.
న్యాయవాద అర్హతలపై అసలు వివాదం!
కేటీ జకారియా న్యాయవిద్య అభ్యసించినప్పటికీ.. అమెరికాలో న్యాయవాదిగా వ్యవహరించేందుకు అవసరమైన బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదన్న విషయం వివాదానికి కేంద్రంగా మారింది. పెప్పర్డైన్ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో ఆమె విద్యను అభ్యసించారు. ట్రంప్‌తో పాటు పలువురు ఆమెను న్యాయవాదిగా పేర్కొనడంతో ఈ అంశంపై మీడియా దృష్టి సారించింది.
మంగళవారం జరిగిన తొలి మీడియా సమావేశంలో ఓ విలేకరి.. ఆమె ఏ ప్రాంతంలో బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని ప్రశ్నించారు. అందుకు కేటీ ‘‘చైనాలో’’ అని సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యతో ఆమె అర్హతలపై మరిన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి.
అమెరికాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలంటే సంబంధిత రాష్ట్ర బార్ నిబంధనలకు అనుగుణంగా అర్హత పొందాలి. ఈ నేపథ్యంలో మీడియా లోతుగా ఆరా తీయడంతో.. తాను బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని గురువారం కేటీ అంగీకరించారు.
అయితే, చైనాలో తగిన అర్హతలతో అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించిన న్యాయ సేవలు అందించినట్లు ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఆమెకు ఉన్న విద్యార్హతలు, వృత్తిపరమైన అనుభవం, గతంలో చేసిన వ్యాఖ్యల మధ్య ఉన్న వ్యత్యాసాలపై చర్చ మరింత తీవ్రమైంది.
ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలోనూ ఇరకాటం!
కేటీ అర్హతలపై సంప్రదాయవాద భావజాలానికి దగ్గరగా ఉండే ఫాక్స్ న్యూస్ కూడా ప్రశ్నలు సంధించింది. గురువారం ఆ ఛానల్ వ్యాఖ్యాత సీన్ హానిటీతో జరిగిన ఇంటర్వ్యూలో బార్ పరీక్ష అంశం ప్రస్తావనకు వచ్చింది.
తాను పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని కేటీ చెప్పినప్పుడు.. ‘‘నేను ఎప్పుడూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయలేదు అని నేరుగా ఎందుకు చెప్పలేదు?’’ అని హానిటీ ప్రశ్నించారు.
ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టడానికి ముందు తగినంత సమయం లభించలేదని కేటీ వివరించారు. తొలి మీడియా సమావేశానికి వారం కూడా ముందుగా కాకుండా, అంతకంటే తక్కువ వ్యవధిలోనే తన నియామకం జరిగినట్లు తెలిపారు. దీంతో హానిటీ మరో ప్రశ్న సంధించారు. ‘‘అంటే, సిబ్బంది మీకు మరింత మెరుగ్గా శిక్షణ ఇచ్చి ఉండాల్సిందని మీరు భావిస్తున్నారా?’’ అని అడిగారు. ఈ ప్రశ్నతో పదవికి ఆమె ఎంతవరకు సిద్ధమయ్యారన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. శుక్రవారం ట్రంప్ తరచూ వీక్షించే ‘ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్’ కార్యక్రమంలోనూ ఆమెకు ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. తాను న్యాయవాదిని కాదన్న విషయాన్ని ట్రంప్‌కు ఎందుకు వెల్లడించలేదని అడగ్గా.. ‘‘ఆ ప్రశ్నలు అడగలేదు’’ అని సమాధానమిచ్చారు. తాను న్యాయపరమైన బాధ్యతల కోసం కాకుండా, సమాచార ప్రసార వ్యవహారాల కోసం నియమితురాలినయ్యానని స్పష్టం చేశారు.
అయితే, కార్యక్రమ వ్యాఖ్యాత లారెన్స్ జోన్స్ మరో కీలక ప్రశ్న అడిగారు. ‘‘అధ్యక్షుడికి ఇప్పటికీ మీపై నమ్మకం ఉందని భావిస్తున్నారా?’’ అని ప్రశ్నించారు.దీనికి ఆమె నేరుగా సమాధానం ఇవ్వలేదు. ‘‘నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి నమ్మకాన్ని, విశ్వాసాన్ని సంపాదించుకోగలనని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
మధ్యంతర ఎన్నికల వేళ రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ?
అమెరికాలో నవంబరులో జరగనున్న మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేటీ నిష్క్రమణ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ఎవరి ఆధిపత్యం ఉంటుందన్నది తేలనుంది. ఇలాంటి సమయంలో వైట్‌హౌస్ మీడియా విభాగంలో చోటుచేసుకున్న పరిణామాన్ని డెమోక్రాట్లు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల అగ్రనేత హకీమ్ జెఫ్రీస్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందించారు.
‘‘వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ వెళ్లిపోతున్నారు. ‘మాగా’ తీవ్రవాదులు వరుసగా విఫలమవుతూనే ఉన్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ మద్దతుదారుల రాజకీయ నినాదమైన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా)ను ప్రస్తావిస్తూ రిపబ్లికన్ వర్గాలపై విమర్శలు గుప్పించారు.
అయితే, కేటీ నిష్క్రమణతో వైట్‌హౌస్ మీడియా విభాగంలో తదుపరి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది ఇంకా కీలకంగా మారింది.
ట్రంప్ తొలి పాలనలోనూ ఇదే తరహా ఘటన!
ట్రంప్ వైట్‌హౌస్ బృందంలో అత్యంత తక్కువ వ్యవధిలో పదవి నుంచి తప్పుకుంటున్న వారిలో కేటీ నిష్క్రమణ ప్రత్యేకంగా నిలుస్తోంది. ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా నియమితులైన ఆంథోనీ స్కారమూచీ కేవలం పది రోజులకే పదవి నుంచి తప్పుకున్నారు.కేటీ నిష్క్రమణ వార్త వెలువడిన తర్వాత స్కారమూచీ కూడా ‘ఎక్స్’లో స్పందించారు.‘‘రికార్డులు బద్దలవ్వడానికే ఉంటాయి. అయితే, ఇతరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందుకు నాకు ఎలాంటి ఆనందం లేదు’’ అని పేర్కొన్నారు. మొత్తానికి.. తొలి మీడియా సమావేశంలో తడబాటు, న్యాయవాద అర్హతలపై వివాదం, వరుస ఇంటర్వ్యూల్లో ఎదురైన ప్రశ్నలు.. ఇలా కేవలం కొద్ది రోజుల్లోనే కేటీ జకారియా చుట్టూ పరిణామాలు వేగంగా మారిపోయాయి. అధ్యక్షుడు ట్రంప్ బహిరంగ వ్యాఖ్యల తర్వాత ఆమె నిష్క్రమణ వార్త వెలువడటంతో వైట్‌హౌస్‌లో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది.అమెరికా రాజకీయాల్లో కీలక ఎన్నికలకు ముందు.. వైట్‌హౌస్ మీడియా విభాగంలో ఈ ఆకస్మిక మార్పు ట్రంప్ ప్రభుత్వానికి మరో ఇబ్బందికర పరిణామంగా మారింది.
