కోమటిలంకకు వంతెన ఎప్పుడూ?..

తుపాను వస్తే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే!
పడవలపైనే గ్రామ ప్రజల రాకపోకలు..
విద్యకు దూరమవుతున్న 110 మంది విద్యార్థులు

మండవల్లి, ఆంధ్రప్రభ: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కోమటిలంక గ్రామ ప్రజల కష్టాలు ప్రభుత్వాలు మారుతున్నా తీరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరదలు, తుపానుల ప్రభావంతో పోల్రాజ్‌ డ్రెయిన్‌ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామం ఎల్లప్పుడూ ద్వీపాన్ని తలపిస్తోంది.

కొల్లేరు ప్రాంతంలో ఉన్న కోమటిలంక గ్రామానికి వెళ్లేందుకు కైకలూరు మండలం ఆటపాక పక్షుల అభయారణ్య ప్రాంతంలోని గట్టు మాత్రమే ప్రధాన మార్గంగా ఉంది. అయితే గ్రామానికి వెళ్లే మార్గంలో కొల్లేరు సరస్సు, పోల్రాజ్‌ డ్రెయిన్‌ అడ్డంకిగా మారడంతో ప్రజలు పడవలపై ప్రయాణిస్తూ రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విద్యార్థుల చదువులకు తుపాను ఆటంకం

కోమటిలంక గ్రామానికి చెందిన దాదాపు 110 మంది విద్యార్థులు కైకలూరులోని పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్నారు. డ్రెయిన్‌లో నీటి ప్రవాహం పెరగడంతో గత కొన్ని రోజులుగా విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లలేకపోతున్నారు. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పి. మంజు ప్రతిరోజూ పడవపై ప్రయాణించి కళాశాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తుపానులు, భారీ వర్షాల సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని తెలిపారు.
గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి పరిస్థితి దయనీయం

గ్రామంలోని గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రులకు చేరుకోవాలంటే ముందుగా డ్రెయిన్‌ను దాటాల్సి వస్తోందని వాపోతున్నారు. గతంలో తుపానుల సమయంలో డ్రెయిన్‌ దాటే క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని గ్రామస్థులు గుర్తు చేస్తున్నారు. పాము కాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

అటవీ శాఖ నిబంధనలతో నిలిచిపోయిన అభివృద్ధి

ఆటపాక పక్షుల అభయారణ్యం అటవీ శాఖ పరిధిలో ఉండటంతో శాశ్వత రహదారి, వంతెన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు చెబుతున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్గాలు కూడా భారీ వర్షాల సమయంలో నీటిలో మునిగిపోతుండటంతో ప్రజలు పూర్తిగా పడవలపై ఆధారపడాల్సి వస్తోంది.

కలెక్టర్‌కు వినతిపత్రం

కోమటిలంక గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఘంటసాల వెంకటలక్ష్మి ఏలూరు జిల్లా కలెక్టర్‌కు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందించారు. ఆటపాక నుంచి కోమటిలంక గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గంలో వంతెన నిర్మించడంతో పాటు అధ్వానంగా మారిన రహదారిని పునర్నిర్మించాలని ఆమె కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం ప్రాణాలకు కీలకమైనప్పటికీ గ్రామ ప్రజలు ఇప్పటికీ పడవ ప్రయాణంపై ఆధారపడాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు. కోమటిలంక ప్రజల దశాబ్దాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.