దశ మారేది ఎప్పుడు..?
కర్నూలు బ్యూరో, అక్టోబర్ 30 (ఆంధ్రప్రభ) : జిల్లా పరిపాలనలో సమన్వయం, సమర్థత పెంపుదల లక్ష్యంగా కర్నూలు (Kurnool ) కలెక్టరేట్‌లో అధికారుల ఇంటరాక్టివ్ సెషన్ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి (Collector Dr. A. Siri) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో 91 శాఖల అధికారులు పాల్గొంటున్నారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు రెండు సెషన్‌లుగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ ఇంటరాక్టివ్ సెషన్ ప్రధాన ఉద్దేశ్యం ప్రతి అధికారి అన్ని శాఖల పని తీరు, పథకాల పై సమగ్ర అవగాహన పొందడం, తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం. జిల్లా స్థాయి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ల ద్వారా తమ శాఖల కీలక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, అమలు విధానాలను వివరించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, విభాగాధిపతులు హాజరయ్యారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… “ప్రతి అధికారి పరస్పర అవగాహనతో, సమన్వయంతో పని చేస్తే ప్రజా సేవలు మరింత ఫలవంతంగా మారుతాయి. ఈ ఇంటరాక్టివ్ సెషన్ ద్వారా సమగ్ర పరిపాలన దిశగా ముందడుగు వేస్తున్నాం” అని పేర్కొన్నారు.

