WhatsApp Security Features | వాట్సాప్‌లో స్కామర్లకు చెక్.. ఈ 6 సెక్యూరిటీ ఫీచర్లు తెలుసా!
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా వాట్సాప్‌ను అడ్డం పెట్టుకుని అమాయకులను మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల పేరుతో డబ్బులు అడగడం, బ్యాంకు అధికారులమంటూ నమ్మించడం, గుర్తుతెలియని లింకులు పంపించడం వంటి ప్రక్రియలతో వ్యక్తిగత సమాచారాన్ని కాకుండా డబ్బును సైతం కాజేస్తున్నారు. అయితే, ఇలాంటి మోసాల బారిన పడకుండా వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు వాట్సాప్‌లో పలు భద్రత, ప్రైవసీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లకు ఎక్కువ మందిని చేరుకునే అవకాశం లభిస్తోంది. కొందరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బ్యాంకు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా కస్టమర్ సపోర్ట్ ప్రతినిధులమంటూ పరిచయం చేసుకుంటారు. అత్యవసరంగా డబ్బులు పంపాలని కోరడం, ఓటీపీలు, వెరిఫికేషన్ కోడ్స్ అడగడం, అనుమానాస్పద లింకులు పంపించడం ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండటంతో పాటు వాట్సాప్‌లోని భద్రతా ఫీచర్లను ఉపయోగించుకోవడం ముఖ్యం.
అలాంటి నంబర్ల నుంచి మెసేజ్ వస్తే అలర్ట్..
మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చినప్పుడు వాట్సాప్ కొన్ని సందర్భాల్లో భద్రతా సమాచారాన్ని చూపిస్తుంది. దీనివల్ల ఆ మెసేజ్ పంపిన వ్యక్తి గురించి మరింత తెలుసుకోవడంతో పాటు అవసరమైతే బ్లాక్ లేదా రిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు అడిగినా, వ్యక్తిగత వివరాలు కోరినా వెంటనే స్పందించకుండా వారి వివరాలను నిర్ధారించుకోవాలి.
ఆ అకౌంట్లను బ్లాక్, రిపోర్ట్ చేయండి
వాట్సాప్‌లో అనుమానాస్పదంగా కనిపించే నంబర్లను బ్లాక్ చేసే సదుపాయం ఉంది. ఒకసారి బ్లాక్ చేస్తే ఆ వ్యక్తి వాట్సాప్ ద్వారా మీకు మెసేజ్‌లు పంపడం, కాల్స్ చేయడం సాధ్యం కాదు. అదేవిధంగా రిపోర్ట్ ఆప్షన్ ద్వారా అనుమానాస్పద అకౌంట్ల గురించి వాట్సాప్‌కు ఫిర్యాదు చేయవచ్చు. స్పామ్, మోసాలకు పాల్పడే అకౌంట్లను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
తెలియని నంబర్ల కాల్స్‌తో వస్తే..
గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను నియంత్రించేందుకు వాట్సాప్‌లో సైలెన్స్ అనౌన్ కాల్స్ ‘Silence Unknown Callers’ ఫీచర్ ఉంది. దీన్ని ఆన్ చేసుకుంటే మీ కాంటాక్ట్స్‌లో లేని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ఫోన్ రింగ్ కావు. అయితే ఆ కాల్స్ వివరాలు కాల్ లాగ్‌లో మాత్రం కనిపిస్తాయి. దీంతో అవసరమైతే తర్వాత వాటిని పరిశీలించుకోవచ్చు.
ప్రొఫైల్ వివరాలను లాక్ చేసుకోండి ఇలా..
మీ వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులు చూడకుండా ఉండేందుకు వాట్సాప్‌లో ప్రత్యేక ప్రైవసీ సెట్టింగ్స్ ఉన్నాయి. ప్రొఫైల్ ఫొటో, లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్, అబౌట్, స్టేటస్ అప్‌డేట్స్‌ను ఎవరు చూడాలనేది మీరే నిర్ణయించుకోవచ్చు. వీటిని మై కాంటాక్ట్ ‘My Contacts’ లేదా అవసరాన్ని బట్టి మై కాంటాక్ట్ ఎక్స్ప్ట్1 ‘My Contacts Except’ ఆప్షన్లకు మార్చుకోవడం ద్వారా వ్యక్తిగత సమాచారం అపరిచితులకు కనిపించకుండా జాగ్రత్త పడవచ్చు.
ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణ..
వాట్సాప్‌లో వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్స్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో రక్షించబడతాయి. అంటే పంపిన వ్యక్తి, అందుకున్న వ్యక్తి మాత్రమే ఆ సమాచారాన్ని చదవడం లేదా వినడం చేయగలరు. వాట్సాప్ కూడా వాటి కంటెంట్‌ను చదవలేదు. అయితే ఈ సదుపాయం ఉన్నంత మాత్రాన సైబర్ మోసాలు జరగవని భావించకూడదు. మోసగాళ్లు పంపే లింకులు, మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
సెక్యూరిటీ కోడ్‌ను వెరిఫై చేసుకోండి..
వాట్సాప్‌లోని సెక్యూరిటీ కోడ్ వెరిఫికేషన్ ద్వారా ఒక చాట్ ఎన్‌క్రిప్షన్‌ను నిర్ధారించుకోవచ్చు. ప్రతి చాట్‌కు ప్రత్యేకమైన సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. దీనిని కాంటాక్ట్ వ్యక్తితో పోల్చి చూసుకోవచ్చు. ముఖ్యంగా కొత్త డివైజ్‌కు మారినప్పుడు లేదా భద్రతపై అనుమానం వచ్చినప్పుడు ఈ సదుపాయం ఉపయోగపడుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ, వెరిఫికేషన్ కోడ్స్ చెప్పకండి.
- అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకండి.
- అత్యవసరంగా డబ్బులు అడిగితే ఫోన్ చేసి నిర్ధారించుకోండి.
- వాట్సాప్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్‌ను ఆన్ చేసుకోండి.
- అనుమానాస్పద నంబర్లను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి.
