WhatsApp New Update |వాట్సాప్‌ నుంచి బిగ్‌ అప్‌డేట్‌..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: ఈ డిజిటల్ కాలంలో పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. తల్లిదండ్రులకు ఏదో తెలియని భయం. వాట్సాప్‌లో ఎవరితో మాట్లాడుతున్నారు? ఎలాంటి అనవసరమైన గ్రూపుల్లో చేరుతున్నారు? ఏ ఛానెల్స్ ఫాలో అవుతున్నారు? అని నిత్యం ఆందోళన చెందుతుంటారు. అలాంటి పేరెంట్స్ ఆందోళనకు చెక్ పెడుతూ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఒక మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్‌‌తో ముందుకు వచ్చింది. టీనేజర్ల భద్రతే లక్ష్యంగా అద్భుతమైన ‘పేరెంటల్ కంట్రోల్స్’ ఫీచర్లను అధికారికంగా పరిచయం చేసింది.

పిల్లల పర్సనల్ లైఫ్‌కు, వారి ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండానే.. వారి ఆన్‌లైన్ కార్యకలాపాలపై ఒక కన్ను వేసి ఉంచేందుకు ఈ ఫీచర్లు పేరెంట్స్‌కు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

తల్లిదండ్రుల చేతికి కీలక కంట్రోల్స్..

మీ పిల్లల ప్రొఫైల్ ఫొటోను ఎవరు చూడాలి? వారిని వాట్సాప్ గ్రూపుల్లో ఎవరు పడితే వారు ఆడ్ చేయకుండా నియంత్రించడం ఇకపై తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ టీనేజర్లు ఈ ప్రైవసీ సెట్టింగ్స్‌ను మార్చడానికి ప్రయత్నిస్తే.. పేరెంట్స్ సెట్ చేసిన రహస్య ‘పిన్’ (PIN) నంబర్ తప్పనిసరి. పిల్లలు కొత్తగా ఏదైనా వాట్సాప్ గ్రూప్‌లో చేరినా లేదా బయటకు వచ్చినా తల్లిదండ్రుల ఫోన్‌కు వెంటనే అలర్ట్ మెసేజ్ వస్తుంది. అంతటితో ఆగకుండా, వారు ఉన్న గ్రూప్‌లో సభ్యుల సంఖ్య ఒక్కసారిగా పెరిగితే కూడా సిస్టమ్ అప్రమత్తం చేస్తుంది.

టీనేజర్లు ఏ వాట్సాప్ ఛానెల్స్ ఫాలో అవ్వాలి? సొంతంగా ఛానెల్ క్రియేట్ చేయవచ్చా లేదా? అనే విషయాన్ని తల్లిదండ్రులే నిర్ణయించవచ్చు. అలాగే వారి స్టేటస్‌ను ఎవరు చూడాలనే దానిపైనా కంట్రోల్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ అయిన ‘మెటా ఏఐ’ వినియోగంపైనా ఆంక్షలు విధించే వెసులుబాటు కల్పించారు. సాధారణ 13+ సెట్టింగ్‌తో పాటు, మరింత కఠినమైన ‘పరిమిత కంటెంట్’ ఆప్షన్‌ను పేరెంట్స్ ఎంచుకోవచ్చు.

పిల్లల ప్రైవేట్ చాట్స్ చదవవచ్చా?

ఇక్కడే వాట్సాప్ ఒక కీలక విషయాన్ని స్పష్టం చేసింది. ఈ కొత్త సెట్టింగ్స్ వల్ల పిల్లల వ్యక్తిగత చాటింగ్‌కు ఎలాంటి ముప్పు ఉండదు. సంభాషణలు, వాయిస్ అలాగే, వీడియో కాల్స్ ఎప్పటిలాగే ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్’తో పూర్తి సురక్షితంగా ఉంటాయి. అంటే తల్లిదండ్రులు సెట్టింగ్స్‌ను మాత్రమే మేనేజ్ చేయగలరు తప్ప.. లోపలి మెసేజ్‌లను చదవడం గానీ, కాల్స్ వినడం గానీ సాధ్యపడదు.

ఈ కొత్త ఫీచర్లు ప్రస్తుతం దశలవారీగా రోలౌట్ అవుతున్నాయి. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) వినియోగదారులందరికీ ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.