- జీఎల్ఎస్ డెంటల్ క్లినిక్ డాక్టర్ పై కేసు
- ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఫిర్యాదు
- హన్మకొండ ఠాణాలో కేసు నమోదు
- సిఐ మచ్చ శివ కుమార్
వరంగల్ క్రైమ్, (ఆంధ్రప్రభ) : హనుమకొండ మహానగరంలో ఎండిఎస్ పట్టా లేకుండానే తాను సదరు పట్టా కలిగి ఉన్నట్లు ప్రచారం చేసుకొంటూ ప్రాక్టీస్ చేస్తున్న డా.శేషు కుమార్ పై హన్మకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. విద్యావంతులు కలిగిన జిల్లా కేంద్రంలోనే దర్జాగా ప్రాక్టీస్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్టు ఇండియన్ డెంటల్ అసోసియేషన్, రాష్ట్ర దంత వైద్య మండలి వారు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు.
హన్మకొండలోని హాస్పిటల్స్ జోన్ లోని కాకాజి కాలనీలో డాక్టర్ శేషు కుమార్, జిఎల్ఎస్ డెంటల్, ఇంప్లాంట్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బహిరంగంగా హాస్పిటల్ కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు. సదరు దంత వైద్యుడు తనకు ఎండిఎస్ డిగ్రీ లేకపోయినప్పటికి ఉన్నట్టుగా తప్పుడుగా ప్రచారం చేసుకొంటూ రోగులకు టోకరా ఇస్తున్నాడు.
డాక్టర్ శేషు కుమార్ పత్రికాముఖంగా ప్రచురణ ప్రకటనలు ఇవ్వడమే కాక హాస్పిటల్ ముందు బోర్డులు ఏర్పాటు చేసి గత కొద్ది కాలంగా నగర ప్రజలను మోసం చేస్తున్నాడని, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వరంగల్ ప్రతినిధులు, రాష్ట్ర దంత వైద్య మండలి ప్రతినిధులు హన్మకొండ కలెక్టర్, జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదులు చేశారు.
రాష్ట్ర దంతమండలి, జిల్లా వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో ప్రాథమిక విచారణ జరిపి సదరు డాక్టర్ శేషు కుమార్ ఎటువంటి ఎండీఎస్ డిగ్రీ పట్టా బాగోతాన్ని బట్టబయలు చేశారు. ఎండిఎస్ పట్టా లేకుండా వైద్యం చేయడం నేరంగా పరిగణించడమే కాక ప్రజలను మోసం చేస్తున్నట్టు నిర్ధారించారు.
ఈ మేరకు సదరు డాక్టర్ శేషు కుమార్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి హనుమకొండ పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విచారణ జరిపి హన్మకొండ ఇన్స్ పెక్టర్ మచ్చ శివకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

