ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ
రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వసిద్ధం
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
నరసాపురం, ఆంధ్రప్రభ : జిల్లాలోని నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీల్లో నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం వైఎన్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 1వ తేదీన పోలింగ్ జరిగిన మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో నిర్ణీత సమయానికి కౌంటింగ్ ప్రారంభమైందన్నారు. ఓట్ల లెక్కింపు వేగంగా, ప్రశాంత వాతావరణంలో సాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 60 నుంచి 70 శాతం కౌంటింగ్ పూర్తయిందని, సాయంత్రానికి మొత్తం ప్రక్రియ ముగిసి పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. వర్షం పడుతున్నప్పటికీ ఎక్కడా ఆలస్యం లేకుండా ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బంది, ఇతర సిబ్బంది సమన్వయంతో కౌంటింగ్ నిర్వహిస్తున్నారని వివరించారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 5వ తేదీన జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్, పోలీసు సిబ్బంది నియామకంతో పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని చెప్పారు. బుధవారం నుంచి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. 5వ తేదీన పోలింగ్, 7వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అధికారులందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, నరసాపురం ఆర్డీఓ దాసిరాజు, డీఎస్పీ మేకా సుధాకర్‌రావు పాల్గొన్నారు.
