కరెంటు ఉందా.. ఆరా తీసిన కలెక్టర్
బాలుడితో కుశల ప్రశ్నలు..
ప్రజలతో మమేకమైన జిల్లా కలెక్టర్
నర్సాపురం, ఆంధ్రప్రభ : పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం నర్సాపురం పట్టణంలోని భూపతివారి వీధిలో పర్యటించారు. అర్ణబ్ తుఫాన్ కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై ఆమె ఆరా తీశారు. ఈ సందర్భంగా స్థానికులు, వ్యాపారస్తులను కలిసి కరెంటు ఉందా.. రాత్రి సమయాల్లో విద్యుత్ సరఫరా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. మహిళలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరాలు తెలుసుకున్నారు. యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ఇదే సమయంలో అటువైపుగా సైకిల్‌పై వస్తున్న బాలుడిని కలెక్టర్ ఆపి మాట్లాడారు. ఇలాంటి సమయంలో బయటకు రావద్దని సూచిస్తూ నీ పేరేంటి.. ఏం చదువుతున్నావు.. ఏ పాఠశాలలో చదువుతున్నావు అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్ణబ్ తుఫాన్ కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులను ప్రభుత్వం చేపడుతోందని ప్రజలకు వివరించారు. కలెక్టర్ వెంట నర్సాపురం తహసీల్దార్ ఈ. నాగార్జున, వీఆర్వో ఎం. లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
